ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో పవన్
ఈ పర్యటన ముగిసిన తర్వాతే సింగపూర్‌కు జనసేనాని
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో బాబు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో స్కూల్ సిబ్బంది మార్క్ శంకర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం తెలిసిన వెంటనే పవన్‌ను సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు సూచించారు. అయితే, అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కురిడి గ్రామానికి వస్తానని మాటిచ్చానని, అక్కడి గిరిజనులను కలిసి ఆ తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ కల్యాణ్ బదులిచ్చారు. ఇవాళ ప్రారంభించాల్సిన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తిచేసి వెళ్తానన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత జనసేనాని సింగపూర్ వెళ్లనున్నారు.
మార్క్ శంకర్ కు గాయాలపై చంద్రబాబు స్పందన
మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మార్క్ శంకర్ గాయపడటంపై పెదనాన్న చిరంజీవి, ఏపీ మంత్రి నారా లోకేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరీశ్ రావు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పందించారు. సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలిసింది. ఈ వార్త తీవ్ర విచారానికి గురిచేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బాధాకరమైన సమయంలో పవన్ కల్యాణ్ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నానుఁ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.