కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పల్నాడులో ముస్లింలు చేపట్టిన ర్యాలీకి హాజరైన మాజీ మంత్రి విడదల రజనికి చేదు అనుభవం ఎదురైంది. తమ ర్యాలీని రాజకీయం చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముస్లింలు కోరడంతో చేసేదేమీ లేక రజని వెనుదిరిగారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు ర్యాలీ చేపట్టారు. ముస్లింలకు సంఘీభావం తెలుపుతూ మాజీ మంత్రి రజని ఈ ర్యాలీకి హాజరయ్యారు. కళామందిర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌత్రా సెంటర్ వద్దకు రాగానే మాజీ మంత్రి విడదల రజిని అందులోకి ప్రవేశించి కొంతదూరం నడిచారు. అయితే, మాజీ మంత్రి రాకతో శాంతియుతంగా చేపట్టిన తమ ర్యాలీకి రాజకీయ రంగు అంటుతుందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ర్యాలీలో పాల్గొన వద్దంటూ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ర్యాలీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఆమెను కోరారు. అయితే, వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు కూడా వాటిలో పాల్గొంటున్నారని చెబుతూ పోలీసులతో రజని వాగ్వాదానికి దిగారు. దీనిపై ర్యాలీ నిర్వాహకులు స్పందిస్తూ.. పార్టీలకతీతంగా ముస్లింలంతా ఈ ర్యాలీలో పాల్గొన్నారని చెప్పారు. అందుకే ఒక పార్టీకి చెందిన మిమ్మల్ని వద్దంటున్నామని రజినికి తెలిపారు. చేసేదేమీ లేక ఆమె వైసీపీ నాయకులతో ర్యాలీ నుంచి దూరంగా వెళ్లి, విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు.
పల్నాడులో మాజీ మంత్రి విడదల రజనికి చేదు అనుభవం
RELATED ARTICLES