కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శైలజానాథ్ కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో శైలజానాథ్ మాట్లాడుతూ… జగన్ నాయకత్వంలో పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందని అన్నారు. శైలజానాథ్ వైసీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. శైలజానాథ్ తో పాటు వచ్చిన వారిని జగన్ ఆప్యాయంగా పలకరించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.