పోకూరు సచివాలయం పక్కనే పేరుకుపోతున్న చెత్తా చెదారం
పట్టించుకోని అధికారులు. దుర్వాసనతో జనం అవస్థలు.
చెత్తకు నిప్పు పెట్టడంతో జనం ఉక్కిరి బిక్కిరి
విశాలాంధ్ర వలేటివారిపాలెం : గ్రామాల్లో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించి వాటి నుంచి సంపద సృష్టించి పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్న సంకల్పంతో గతప్రభుత్వం లక్షలు వెచ్చించి పంచాయతీలలో చెత్త సంపద కేంద్రాలు నిర్మించింది. ప్రస్తుతం ఆ చెత్త సంపద కేంద్రానిరుపయోగంగా మారడంతో గ్రామాల్లో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను రోడ్డు పక్కన పడవేసి కాల్చి వేస్తున్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడం, పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుకారిపోతుంది.మండలంలోని పోకూరు సచివాలయం ప్రక్కన చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. గ్రామంలోని ప్రజలు చెత్తాచెదారం పారబోస్తున్నారు.పంచాయతీ కి చెందిన గ్రీన్ అంబాసిడర్లు చెత్తను సేకరించి సచివాలయం ప్రక్కన పారబోస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ చెత్తకు నిప్పు పెడుతున్నారు దీనితో పొగ అంతా కమ్ముకొని అటుగా రాకపోకలు సాగించేవారు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రక్కనే సచివాలయం లో ఉన్న పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.చెత్తను సంపద కేంద్రాలకు తరలించి ఎరువుగా తయారు చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తారనుకుంటే ఇలా ఇష్టారాజ్యం గా పారబోస్తుండడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తా చెదారాన్ని సంపద కేంద్రాలకు తరలించాల్చిందిగా పలువురు కోరుతున్నారు.