తిరుపతి నుంచి కోయంబత్తూర్ వెళ్తుండగా ఈ నెల 14న ఘటన.
అనధికార ప్రయాణికులు, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై తండ్రి ఆరోపణ
తమిళనాడు, ఏపీ సీఎంలకు, టూరిజం అధికారులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన బస్సులో ఓ మైనర్ బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 14న తిరుపతి నుంచి కోయంబత్తూర్ వెళ్తున్న ఏపీ టూరిజం బస్సులో ఈ ఘటన జరిగినట్లు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె ప్రయాణిస్తున్న బస్సులోకి సిబ్బంది అనధికారికంగా ప్రయాణికులను ఎక్కించుకున్నారని, బస్సులోని సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ అమానుష ఘటనపై, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ టూరిజం శాఖ ఉన్నతాధికారులకు ఆయన ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు.
ఈ ఫిర్యాదుపై ఏపీ పర్యాటక శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. ఘటనపై విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణ అనంతరం బస్సు డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.