ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ఫ్యూచర్ల ధరలు మంగళవారం తగ్గుముఖం
దేశీయంగా బంగారం, వెండి ధరలు మంగళవారం నాడు ఒత్తిడికి గురయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం ట్రేడింగ్‌లో రూ.332 (0.36%) నష్టపోయి రూ.92,965 వద్దకు చేరాయి. అదేవిధంగా, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.281 (0.29%) తగ్గి కిలోకు రూ.95,172 వద్ద ట్రేడయ్యాయి. గరిష్ఠ స్థాయి రూ.99,358 నుంచి బంగారం ధర ఇప్పటివరకు రూ.6,513 మేర పతనమైనప్పటికీ, గత వారం రోజులుగా ధరల్లో తీవ్ర ఒడిదుడుకులున్నా, మొత్తం మీద స్థిరంగానే కొనసాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడింగ్ ఆరంభంలో, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ తగ్గించడంతో పసిడి, వెండి ధరలు పెరిగాయి. అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలపై వస్తున్న సానుకూల సంకేతాలు ఈ పెరుగుదలను నిలువరించాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే ఈ లోహాలకు డిమాండ్ తగ్గడంతో, బంగారం ధర ఔన్స్‌కు 3,320 డాలర్ల దిగువకు, వెండి 32.20 డాలర్ల దిగువకు జారాయి. అయినప్పటికీ, సోమవారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.93% లాభంతో రూ.93,297 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ 0.14% పెరుగుదలతో రూ.95,453 వద్ద స్థిరపడ్డాయి.
డాలర్ ఇండెక్స్ బలహీనపడటం (0.07% తగ్గి 100.36 వద్ద) పసిడికి కొంత ఊరటనిచ్చింది. ప్రిథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ నిపుణుడు మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పంద ప్రయత్నాలు బంగారం, వెండి ధరల పెరుగుదలను పరిమితం చేయవచ్చని తెలిపారు. ఈ వారం డాలర్ ఇండెక్స్‌లోని అస్థిరత, శాంతి చర్చల ఫలితంగా ధరలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో బంగారానికి రూ.92,750-92,200 వద్ద మద్దతు, రూ.93,850-94,400 వద్ద నిరోధంబీ వెండికి రూ.94,800-94,000 వద్ద మద్దతు, రూ.96,000-96,650 వద్ద నిరోధం ఉండొచ్చని జైన్ సూచించారు. వెండిని రూ.94,800 సమీపంలో కొని, రూ.94,150 స్టాప్ లాస్‌తో రూ.96,100 లక్ష్యంగా పెట్టుకోవచ్చని సలహా ఇచ్చారు.