కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పుత్తడి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారంపై రూ. 2,400 తగ్గి రూ. 91 వేలకు చేరుకుంది. కిలో వెండి ధరపై ఏకంగా రూ. 8 వేలు తగ్గి రూ. 89,800కు పడిపోయింది. ఈ నెల 1న బంగారం ధర రూ. 94 వేలపైకి ఎగబాకగా, ఇప్పటి వరకు రూ. 3 వేలు తగ్గింది. అలాగే, వెండి ధర రెండు రోజుల క్రితం రూ. 1.02 లక్షలు ఉండగా రూ. 12 వేలకు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర నిన్న ఒక్క రోజే 80 డాలర్లకు పైగా తగ్గడం, వెండి ధర కూడా అదే స్థాయిలో పతనం కావడంతో దేశీయంగా వాటి ధరలు దిగి వచ్చాయి.