రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా నెల్లూరు నగరంలో మరో ముందడుగు పడింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో అత్యంత ఆధునికంగా అభివృద్ధి చేసిన రెండు ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన నెల్లూరు చేరుకోగా, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా పలువురు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముందుగా నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ ఫౌండేషన్ అందించిన రూ.8.3 కోట్ల ఆర్థిక సహకారంతో సమూలంగా ఆధునికీకరించిన ఆర్.ఎస్.ఆర్. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నూతన భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగి విద్యార్థులతో ముచ్చటించారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, డైనింగ్ హాల్‌ను పరిశీలించి, మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
కార్పొరేట్ హంగులతో ఆర్ఎస్ఆర్ స్కూల్
వీపీఆర్ ఫౌండేషన్ నిధులతో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ పాఠశాలలో మొత్తం 43 తరగతి గదులను అందుబాటులోకి తెచ్చారు. డిజిటల్ బోధన కోసం ప్రతి గదిలో ఎల్ఈడీ స్క్రీన్లు, ఆధునిక బెంచీలు ఏర్పాటు చేశారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులకు ప్రయోగాత్మక, సాంకేతిక విద్య అందించేందుకు ప్రత్యేకంగా కంప్యూటర్, రోబోటిక్స్, ఆస్ట్రో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లను సిద్ధం చేశారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. చదువుతో పాటు క్రీడలకు కూడా పెద్దపీట వేస్తూ పాఠశాలలో ఎకరం విస్తీర్ణంలో విశాలమైన క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు సుమారు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సింథటిక్ కోర్టును, అవుట్డోర్ జిమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.అనంతరం మూలపేట 39వ డివిజన్లో రూ.13.4 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించిన దేవిరెడ్డి శారద (డీఎస్ఆర్) ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాలను కూడా లోకేశ్ ప్రారంభించారు.
ఫలితాలపై దృష్టి పెట్టండి: మంత్రి లోకేశ్
పాఠశాలల ప్రారంభోత్సవం అనంతరం, ఆర్.ఎస్.ఆర్. పాఠశాల పనితీరుపై ప్రధానోపాధ్యాయుడు, ఇతర అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. కేవలం భవనాలు నిర్మిస్తే సరిపోదని, విద్యా ప్రమాణాలు, ఫలితాలు కూడా మెరుగుపడాలని స్పష్టం చేశారు. గతేడాది పదో తరగతిలో కేవలం 60.19 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థుల హాజరు, ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గుతున్నాయని ఆరా తీశారు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి.షరణి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


