దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 నిర్భయ ఘటనను గుర్తుచేసేలా మరో దారుణం గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 4న జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 16 ఏళ్ల బాలిక, చదువు విషయంలో తల్లి మందలించడంతో ఇంట్లో చెప్పకుండా నోయిడాలోని తన బంధువుల ఇంటికి బయలుదేరింది. అయితే, చీకటి పడటం, భారీ వర్షం కురుస్తుండటంతో నోయిడాలోని ప్యారి చౌక్ వద్ద బస్సు దిగింది. అప్పటికే రాత్రి 9 గంటలు కావొచ్చింది. తాను చేరాల్సిన గమ్యం ఇంకా 25 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుసుకుని, వర్షంలో తడుస్తూ ఒంటరిగా నిల్చుంది.ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆమె దగ్గర ఆగింది. అది లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాల కోసం ఉపయోగించే స్లీపర్ బస్సు కావడం, అందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం గమనార్హం. తాము కూడా నోయిడా సెక్టార్ 63 వైపే వెళుతున్నామని కండక్టర్ చెప్పడంతో బాలిక బస్సు ఎక్కింది. వాస్తవానికి ఆ బస్సు గ్రేటర్ నోయిడాలోని సూరజ్‌పూర్‌లోని ఓ వర్క్‌షాప్ నుంచి తిరిగి వస్తోంది.
బస్సు కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే చంపేస్తామని డ్రైవర్, కండక్టర్ ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం తర్వాత, బాధితురాలిని ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వద్ద రింగ్ రోడ్ సమీపంలో వదిలేసి పరారయ్యారు.
ధైర్యం కూడగట్టుకున్న బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)లను ఉత్తర ఢిల్లీలోని తిమార్పూర్లోని ఓ పార్కింగ్ స్థలంలో అరెస్ట్ చేశారు. విశ్వనాథ్ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫోరెన్సిక్ బృందం బస్సులో బాధితురాలి వెంట్రుకలను గుర్తించింది. స్లీపర్ బస్సు కావడంతో బెర్తులకు కర్టెన్లు ఉండటాన్ని నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు. బస్సు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులు గత రెండేళ్లుగా ఇదే ట్రావెల్స్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది.


