భారత-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయి. కాగా, కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కొనసాగింపునకు ఈ మధ్యాహ్నం జరగాల్సిన భారత్-పాక్ డీజీఎంఓల హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. వాయిదాకు గల కారణాలు వెల్లడి కాలేదు. ఈ చర్చలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఎలాంటి షరతులకు లొంగేది లేదని భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తుండగా, పాకిస్థాన్ ఏంచెబుతోందనన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. అటు, దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నివాసంలో మరో కీలక భేటీ జరుగుతోంది. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.