సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర అనంతపురం : ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు ఇవ్వాలని జనవరి 17న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విజయవాడలోని సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 26 జిల్లాల కార్యదర్శులు, పట్టణ కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమాఖ్య ఆఫీస్ బెర్ల సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మూడు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించబడిందన్నారు. ఈ విషయాలపై ఒక కార్యచరణ కూడా రూపుదిద్దించి దానికి రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగిందన్నారు. ప్రధాన అంశంగా గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, గాను మూడు సెంట్లుగా, పట్టణాల్లో 1 సెంటు రెండు సెంట్లుగా చొప్పున ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల నుంచి పెరిగిన ధరల దృష్టిలో పెట్టుకుని ఐదు లక్షలకు పెంచాలన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు నివాసముంటున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు పూర్తి చేసి కలెక్టరేట్ కార్యాలయంలో ఇవ్వడం జరిగిందన్నారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఇంటి పట్టాలు దరఖాస్తులు పూర్తి చేసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దుచేయాలి! పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీల భారాలను ప్రభుత్వమే భరించాలన్నారు.
గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో అదానీ కంపెనీలతో రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందనేది సిపిఐ ముందునుండీ ఆరోపించిందన్నారు. దీనిపై అక్టోబర్ 24వ తేదీన న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి, ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా లబ్దిపొందారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రూ.1750 కోట్లు లంచాలుగా ముట్టజెప్పడం ద్వారా లబ్దిపొందినట్లు చెబుతున్నారు. చివరికి అమెరికాలోని న్యూయార్స్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదయ్యిందంటే అదానీ అవినీతిపర్వం పరాకాష్టకు చేరింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీజైజైన్, రంజిత్లుప్తా, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, రూపేష్ అగర్వాల్ అనే వారిపై దాదాపు ఏడుగురికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే అన్నారు. ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ వారు మోపిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన విద్యుత్ సర్దుబాటు చార్జీలు రూ.6072 కోట్ల విద్యుత్ భారం 2024 డిసెంబర్ నెల నుండి వినియోగదారులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉండగా వామసక్షాలతోపాటు స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించింది. కాని అధికారం చేపట్టాక మళ్లీ స్మార్టీమీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తూ మరో రూ.7 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారు అన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు “మేము అధికారంలోకొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చార్జీలను పెంచబోమని, వీలైతే తగ్గించేందుకు ప్రయత్నిస్తామని’ చెప్పారు. కాని ఇప్పుడు దాదాపు రూ.15484 కోట్ల విద్యుత్ భారాలను రాష్ట్ర ప్రజలపై మోపేందుకు సిద్ధమవ్వడం విచారకరమన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అదానీతో జగన్ సర్కార్ చేసుకున్న చీకటి ఒప్పందాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అదానీ కుంభకోణంలో అవినీతికి పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత వైసిపి ప్రభుత్వం అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దుచేయాలి. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై మోపిన విద్యుత్ భారాలను విరమించుకోవాలని, ఆయా భారాలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు.
పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ “పదేపదే అంబేద్కర్ అని ఎందుకంటారు?
అంబేద్కర్కు బదులు ఏ హిందూ దేవుడినైనా తలచుకుంటే స్వర్గానికి వెళ్తారు” అని వ్యాఖ్యానించడం దుర్మార్గం. అమితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరుస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు పి నారాయణస్వామి, సి మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు.