Thursday, May 1, 2025
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ లో భారీ కార్చిచ్చు.. జెరూసలెం శివార్లలో 3 వేల ఎకరాలు బుగ్గి

ఇజ్రాయెల్ లో భారీ కార్చిచ్చు.. జెరూసలెం శివార్లలో 3 వేల ఎకరాలు బుగ్గి

అంతర్జాతీయ సాయం కోరిన ఇజ్రాయెల్ ప్రభుత్వం
ఇజ్రాయెల్ లోని జెరూసలేం నగర శివారు ప్రాంతాల్లో భారీ కార్చిచ్చు సంభవించింది. అడవుల్లో మొదలైన మంటలు వేగంగా వ్యాపించడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా వేలాది మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది గాయపడినట్లు సమాచారం అందింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. హైవే పక్కన ఎగిసిపడుతున్న మంటల నుంచి వాహనాలు దూసుకెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్చిచ్చు కారణంగా జెరూసలెం శివార్లలో దాదాపు 3 వేల ఎకరాల మేర భూమి కాలి బూడిదైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 160కి పైగా అగ్నిమాపక బృందాలు, విమానాలు, హెలికాప్టర్లు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. బలమైన గాలుల కారణంగా మంటలను ఆర్పడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. ఇది ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద అగ్నిప్రమాదాల్లో ఒకటని పేర్కొన్నారు. కార్చిచ్చు కారణంగా పలు జాతీయ రహదారులను మూసివేశారు.

కార్చిచ్చు తీవ్రత దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రద్దు చేసింది. మంటలు జెరూసలేం నగర శివార్లకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ అంతర్జాతీయ సహాయం కోరింది. ఉక్రెయిన్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలు సహాయక విమానాలను పంపించాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు