భారతదేశం, పాకిస్తాన్ ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాంతికి ప్రాధాన్యతనిస్తూ, భారతదేశం దాడులు ఆపేస్తే, తాము కూడా యుద్ధానికి ముందడుగు వేయబోమని ప్రకటించారు.
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు క్రమంగా యుద్ధం దిశగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇరు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతుండగా, సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో యుద్ధ వాతావరణం పెరుగుతోంది. ఇదే సయమంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడుతూ, భారతదేశం తన దాడుల చర్యను ఆపితే, పాకిస్తాన్ కూడా అదే చేస్తుందన్నారు. ఈ ప్రకటన, పరిస్ధితిని మరింత ఉద్రిక్తంగా మార్చకుండా సంయమనం పాటించాలనే సంకేతాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
10 ప్రదేశాలపై దాడి
అయితే ఈ ప్రకటనపై భారత్ ఎలా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయాలు తెలియాల్సి ఉంది. భారత్ తాజాగా షోర్కోట్లోని రఫికి ఎయిర్‌బేస్, చక్వాల్లోని మురిద్ ఎయిర్‌బేస్, రావల్పిండిలోని చక్లాలా కాంట్పై దాడులు చేసిందని పాకిస్తాన్ సైన్యం ఈరోజు ఉదయం ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా, వారు భారతదేశంలోని 10 ప్రదేశాలపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో పంజాబ్‌లోని బ్రహ్మోస్ క్షిపణి స్టోరేజ్, ఉరి సరఫరా డిపో, రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ ఎయిర్‌ఫీల్డ్, ఆదంపూర్‌లోని S-400 వ్యవస్థ, డెహ్రాంగ్యారి, పఠాన్‌కోట్ ఎయిర్‌ఫీల్డ్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయని చెబుతోంది.
ఎలాంటి నష్టం లేదు
భారత దాడిలో పాకిస్తాన్‌కు ఎటువంటి నష్టం జరగలేదని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ బేస్ వద్ద ఒక కారు తప్ప పాకిస్తాన్ వైమానిక స్థావరం దెబ్బతినలేదని ఆయన చెబుతున్నారు. భారతదేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం కీలక రాజకీయ నాయకులతో టెలిఫోన్ చర్చలు జరిపి సైనిక చర్య గురించి వారికి వివరించారు. భారతదేశానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని ప్రధానమంత్రి కోరారు. భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. నివేదికల ప్రకారం ఆయన ఈరోజు సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.