ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ పొడిగించారు. ఏపీపీఎస్సీ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు విజయవాడ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో, పీఎస్ఆర్ ను కాసేపట్లో విజయవాడ జైలుకు తరలించనున్నారు.
సినీ నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆయనను, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన మరో కేసులోనూ పోలీసులు పీటీ వారంట్ పై అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
పీఎస్ఆర్ ఆంజనేయులు 2018-2019 మధ్యకాలంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగమయ్యాయని తీవ్ర ఆరోపణలున్నాయి. వాస్తవానికి మాన్యువల్ మూల్యాంకనం జరగనప్పటికీ, జరిగినట్లుగా రికార్డులు సృష్టించి కోట్ల రూపాయలు అక్రమంగా పొందారని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై ఏప్రిల్ 29న ఆంజనేయులుపై ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత విశ్వాసఘాతుకం), 420 (మోసం) కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఆంజనేయులును అరెస్ట్ చేసేందుకు పోలీసులు పీటీ వారంట్ కోరగా, విజయవాడ మొదటి ఏజేసీజే కోర్టు మే 7న అనుమతించింది. ఇవాళ (మే 8) ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరచాలన్న ఆదేశాల మేరకు పోలీసులు పీఎస్ఆర్ ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు రిమాండ్ విధించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పేపర్ల మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన ాకామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్్ణ సంస్థ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు న్యాయస్థానం ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. గతంలో డిజిటల్ పద్ధతిలో చేసిన మూల్యాంకనాన్నే, తర్వాత మాన్యువల్ పద్ధతిలో చేసినట్లుగా చూపించి అవే మార్కులు వేశారని, వాస్తవంగా పేపర్లు దిద్దకుండానే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మధుసూదన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ1 కాగా, మధుసూదన్ ఏ2గా ఉన్నారు. మూల్యాంకనం కోసం ఈ సంస్థకు రూ. 1.14 కోట్లు చెల్లించగా, ఇందులో రూ. 66 లక్షల మేర అవినీతి జరిగిందని సీఐడీ ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.