విశాలాంధ్ర- అనంతపురం : కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం లో కుందుర్పి మండలం, బెస్తరపల్లి గ్రామంలో అమరవీరుల స్తూపాన్ని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్, కె .రామకృష్ణ, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ ల చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని గురువారం జిల్లా కార్యదర్శి జాఫర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కళ్యాణదుర్గం కమ్యూనిస్టు పార్టీకి పురిటి గడ్డ బెస్తరపల్లి కేంద్రంగా 1950 దశకంలో దున్నేవాడికి భూమి నినాదంతో శివాయిజమ భూములు, బంజరు భూములు, భూస్వాముల, పెత్తందారుల, కబంధహస్తాల్లో బినామీ పేర్ల మీద ఉన్న భూములు, దేవాలయ భూములు 45 వేల ఎకరాలకు పైబడి పంచిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. చారిత్రక భూ పోరాట ఉద్యమంలో పాల్గొన్న విప్లవ యోధులను స్మరిస్తూ పోరాట స్ఫూర్తికి చిహ్నంగా అమరవీరుల స్తూపంతో పాటు సిపిఐ ఆఫీసు గ్రంథాలయం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాల కార్యక్రమంలో భాగంగా 130 మంది అమరవీరుల పేర్లు లిఖిస్తూ జనవరి 5 న అమరవీరుల స్తూపావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మేధావులు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతిపరులు, అలనాటి పోరాట యోధుల వారసులు ,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.