ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే, ఆ విషయాన్ని బంధువులు, స్నేహితులకు తెలియజేసి అంత్యక్రియలు నిర్వహించడం సహజం. కానీ, హైదరాబాద్‌లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తల్లి మరణించిన తరువాత, అంత్యక్రియలు నిర్వహించకుండా ఇద్దరు కుమార్తెలు నాలుగు రోజులుగా మృతదేహంతోనే ఇంట్లో ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ హృదయ విదారక ఘటన సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వారాసిగూడ బౌద్ధనగర్‌లో లలిత అనే మహిళ ఇటీవల మరణించారు. ఆమె నివాసం నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. తల్లి మరణంతో మానసిక ఒత్తిడికి గురైన ఇద్దరు కుమార్తెలు ఏమి చేయాలో తెలియక, నాలుగు రోజులుగా ఒక గదిలో తల్లి మృతదేహాన్ని ఉంచి, మరో గదిలో వారున్నట్లు గుర్తించారు.
లలిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె మరణించి నాలుగు రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గుండెపోటుతో ఆమె మరణించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారాసిగూడ పోలీసులు తెలిపారు.