కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
పోరాటాల ద్వారా ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటాం !
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : గ్రామీణ స్థాయి నుంచి సభ్యత్వమును వేగవంతం చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న గ్రామీణ కష్టజీవులు, పేదల వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కేశవరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, అనంతపురం సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ… గ్రామీణ స్థాయి నుంచి రాజ్యాంగ పరిరక్షణ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో బిజెపి ప్రభుత్వం ప్రజల్లో మతతత్వాన్ని పెంచిపోషిస్తున్నదన్నారు. మోడీ ప్రభుత్వం పేదలు పోరాడి సాధించుకున్న చట్టాలను కాలరాస్తోన్నదన్నారు. వ్యవసాయ కార్మిక, యువజన,విద్యార్థి,మహిళ ల హక్కులను నిర్వీర్యం చేస్తోందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి సభ్యత్వాన్ని వేగవంతం చేసుకుంటూ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యతిరేక విదానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పి4 విదానం అని చెప్తూ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా దాటువేయడానికి పథకం వేశారన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా దాటవేస్తున్నాడన్నారు. భూ సమస్యలు,ఉపాధి హామీ, ఇళ్ల స్థలాల సమస్యలపై భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్లో 4 లక్షల60 వేల కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే, కేవలం 86 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ కష్టజీవుల పట్ల వ్యతిరేక ధోరణి కనపడుతోందని అన్నారు. గ్రామాల్లో వలసల నివారణకు వచ్చిన ఈ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో వలసలు తీవ్రంగా రోజురోజుకి పెరుగుతున్నా వలసల నివారణకు కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖామంత్రి పవన్ కళ్యాణ్ ఫారం పాండ్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎవ్వరు కూడా ఫారం పాండ్స్ తవ్వుకోవడానికి ఇష్టపడట్లేదని, పవన్ కళ్యాణ్ ఈ విషయం గుర్తించాలని అన్నారు.చట్టంలో ఏవైతే పొందుపరచారో వాటిని రైతుల పొలాల్లో పనులు జరిగే విదంగా చూడాలని, వాటన్నిటినీ పక్కనపెట్టి కేవలం ఫారం ఫండ్స్ మాత్రమే తవ్వడం వల్ల కూలీలకు పని దొరకడంలేదని అన్నారు . ఉపాధి హామీ చట్టాన్ని పోరాటాల ద్వారా రక్షించుకుంటామని ఆయన అన్నారు. ఉపాధి హామీలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ఆధిపత్య ధోరణి పెరుగుతున్నదని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో లక్షలాదిమంది గ్రామీణ కష్టజీవులు వలసలు వెళ్లినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని అన్నారు. వలసలు వెళ్లిన గ్రామీణ పేదలను తిరిగి వారి గ్రామాలకు రప్పించాలని వారు కోరారు. ఉపాధి హామీ చట్టం రక్షణకు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నామని ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను కూడా ఆహ్వానిస్తామని ఆయన తెలియజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… సిపిఐ పార్టీ అనుబంధ సంఘాల అయినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం పేదల సంగమని పేదల సమస్యలపై అహర్నిశలు కష్టపడి పని చేసి పేదవారి మన్ననలు పొందాలని కోరారు .రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో పేద ప్రజలకు ఇంటి పట్టాలు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇంటి పట్టాల విషయంలో సిపిఐ పార్టీ అనుబంధ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున దరఖాస్తుల సేకరణ ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయాలు మండల తహసిల్దార్ , కలెక్టరేట్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి మెమొరాండాలు ఇవ్వడం జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి పట్టాల కోసం ఉద్యమాలు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉద్యమంలో పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు వేలాది సంఖ్యలో పాల్గొనడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ వేసిందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాలు చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి సిపిఐ పార్టీ మద్దతు ఇస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధివిధానాలపై గ్రామీణ స్థాయి నుంచి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు తోపుకిష్టప్ప, అనంతపురం జిల్లా అధ్యక్షులు బి రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి పెద్దయ్య, నబి రసూల్ భూపేష్ కే రాధాకృష్ణ, పండుగోలమని, కదిరప్ప, బాలస్వామి, చెనరాయుడు, దేవేంద్ర, వెంకట్రామిరెడ్డి, సుందరం, సింగనమల నియోజకవర్గ పార్టీ కార్యదర్శి కత్తి సత్యనారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.