కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాయి. గత 48 గంటల్లో చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు శుక్రవారం శ్రీనగర్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో కశ్మీర్ ఐజీపీ వీకే బిర్ది కుమార్, విక్టర్ ఫోర్స్ జీఓసీ మేజర్ జనరల్ ధనంజయ జోషి, సీఆర్పీఎఫ్ ఐజీ మితేష్ జైన్ పాల్గొన్నారు. ఐజీపీ వీకే బిర్ది కుమార్ మాట్లాడుతూ, కాశ్మీర్ లోయలో పెరిగిన ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో అన్ని భద్రతా దళాలు తమ వ్యూహాలను సమీక్షించుకున్నాయి. ఈ సమీక్ష అనంతరం ఆపరేషన్లపై మరింత దృష్టి సారించాం. ఈ సమన్వయం, పెరిగిన ఏకాగ్రతతో గత 48 గంటల్లో రెండు విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించాం. షోపియాన్‌లోని కెలార్, ట్రాల్ ప్రాంతాల్లో జరిగిన ఈ ఆపరేషన్లలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి మేము కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. విక్టర్ ఫోర్స్ జీఓసీ మేజర్ జనరల్ ధనంజయ జోషి కెలార్, ట్రాల్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ల గురించి వివరిస్తూ, ఈ రెండు ఆపరేషన్ల సమయంలో భద్రతా దళాలు ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు. మే 12న కెలార్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాద బృందం సంచరిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. మే 13 ఉదయం, కొంత కదలికను గుర్తించిన మా బృందాలు ఉగ్రవాదులను హెచ్చరించగా, వారు కాల్పులతో ప్రతిస్పందించారు. మా దళాలు వారిని మట్టుబెట్టాయి అని ఆయన వివరించారు. ట్రాల్ ప్రాంతంలోని ఒక గ్రామంలో రెండో ఆపరేషన్ జరిగింది. మేము గ్రామాన్ని చుట్టుముడుతుండగా, ఉగ్రవాదులు వేర్వేరు ఇళ్లలో స్థానాలు ఏర్పరచుకుని మాపై కాల్పులు జరిపారు. ఈ సమయంలో, గ్రామస్తులైన పౌరులను రక్షించడం మాకు పెద్ద సవాలుగా మారింది. ఆ తర్వాత ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాం. హతమైన ఆరుగురు ఉగ్రవాదుల్లో షాహిద్ కుట్టే అనే వ్యక్తి ఒక జర్మన్ పర్యాటకుడిపై దాడితో సహా రెండు పెద్ద దాడుల్లో పాల్గొన్నాడు. నిధుల సమీకరణ కార్యకలాపాల్లో కూడా అతడి ప్రమేయం ఉందిఁ అని మేజర్ జనరల్ ధనంజయ జోషి తెలిపారు.