విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో శనివారం బీఎస్పీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ సామేలు అధ్యక్షతన బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్సీరాం 91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్సీరాం చిత్రపటానికి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాన్సీరాం మార్చి 15/1934న పంజాబ్ రాష్ట్రంలో జన్మించారని తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ పై తిరుగుతూ వ్యాప్తి చేశారన్నారు. అలాగే పూలే, సాహూ, మహరాజ్, నారాయణ గురు, పెరియర్ మహనీయుల ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ బహుజనులకు రాజ్యాధికారం రావాలని ఏప్రిల్ 14/1984న బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి బెహన్ కుమారి మాయవతిని భారతదేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1994 లో ముఖ్యమంత్రిని చేసి బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి కాన్సీరాం అని కొనియాడారు. 1991లో భారతదేశంలో బీసీలకు మండల కమీషన్ పై పోరాటం చేసి బీసీలకు రిజర్వేషన్లు అందించిన మహా దర్శనీయకుడు కాన్సీరాం అన్నారు. ఈ కార్యక్రమంలో శరణప్ప, సంజీవప్ప, దావీదు, నరసన్న, పెద్ద నరసప్ప, రత్నం, చిన్న ఏసు, లాజరు, నరసయ్య, ఆరోను, ప్రకాశం, ఈరన్న, సుధాకర్, సుదర్శనం, రంగన్న, సత్యమ్మ, బజారమ్మ, భీమక్క, రంగమ్మ, బొడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.