8 గంటల సమయానికి 62 లక్షల మంది స్నానాలు
నేడు మొత్తంగా 5 కోట్ల మంది వరకు స్నానాలు ఆచరించే అవకాశం
ఆదివారం నాటికి 34.97 కోట్ల మంది స్నానాలు
వసంత పంచమిని పురస్కరించుకుని కుంభమేళాలో సోమవారం లక్షలమంది భక్తులు, సాధువులు, అఖాడాలు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ తెల్లవారుజామున వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమ మహామండలేశ్వరుల నేతృత్వంలో త్రివేణి సంగమానికి చేరుకుని ఉదయం 5 గంటలకు అమృత్ స్నానం చేశారు. ఉత్తరప్రదేశ్ ఇన్ఫర్మేషన్ విభాగం ప్రకారం ఉదయం 8 గంటల సమయానికి 62.25 లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మొత్తంగా ఆదివారం వరకు 34.97 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించుకున్నారు. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో వసంత పంచమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సంప్రదాయం ప్రకారం సన్యాసి, బైరాగి, ఉదాసీన్ అనే మూడు శాఖలకు చెందిన అఖాడాలు ముందుగా నిర్ణయించిన ప్రకారం పవిత్ర స్నానాలు చేస్తున్నారు. కాగా, నేడు ఒక్క రోజే దాదాపు 5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే, మాఘ పూర్ణిమను పురస్కరించుకుని ఈ నెల 12న, మహాశివరాత్రి సందర్భంగా 26న కూడా కుంభమేళాకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది.
వసంత పంచమి వేళ భక్తులతో కిక్కిరిసిపోతున్న కుంభమేళా..
RELATED ARTICLES