బ్రిటన్‌లో ఆసక్తికరమైన ఉద్యోగ వివాదం వెలుగులోకి వచ్చింది.బిజినెస్ ట్రిప్‌లో మద్యం సేవించి, బాధ్యతారాహిత్యంగా, అమర్యాదగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.దీంతో ఆమె ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
ఏకంగా 76 మిలియన్ పౌండ్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.963 కోట్లకు పైగా పరిహారం కోరుతూ దావా వేశారు.
ఈ కేసులో ట్రైబ్యునల్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
బ్రిటన్‌కు చెందిన షానన్ బర్న్స్ 2022లో సాఫ్ట్వేర్ కంపెనీ గిట్‌పాడ్‌లో ఇంజినీరింగ్ విభాగం వైస్‌ప్రెసిడెంట్‌గా చేరారు.ఆ సమయంలో ఆమె వార్షిక వేతనం, బోనస్ కలిపి దాదాపు 3 లక్షల పౌండ్లుగా ఉండేది.2023 ఏప్రిల్‌లో కంపెనీ సీఈఓ, ఇతర టీమ్ సభ్యులతో కలిసి ఆమె ఆస్ట్రియాకు బిజినెస్ ట్రిప్‌కు వెళ్లారు.ఆ పర్యటనలో షానన్ మద్యం సేవించారు. ఆ సమయంలో అనుకోకుండా తన హోటల్ గది తాళం చెవిని పోగొట్టుకున్నారు.దీంతో గదిలోకి వెళ్లలేకపోయారు. చివరకు హోటల్లోని బయట ఉన్న సౌనా రూమ్ (రిలాక్సింగ్ రూమ్)లో ఆ రాత్రి నిద్రించాల్సి వచ్చింది.
తిరిగొచ్చాక ఉద్యోగం నుంచి తొలగింపు
ఆస్ట్రియా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత షానన్ ప్రవర్తనపై కంపెనీ సీఈఓ అభ్యంతరం వ్యక్తం చేశారు.బిజినెస్ ట్రిప్‌లో ఆమె బాధ్యతారాహిత్యంగా, అమర్యాదగా వ్యవహరించారని ఆరోపించారు.ఈ కారణాలతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే సంస్థ నిర్ణయాన్ని షానన్ తీవ్రంగా వ్యతిరేకించారు.ట్రిప్‌లో తనతో పాటు పురుష సిబ్బంది కూడా మద్యం సేవించారని, అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనను మాత్రమే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు.ఇది తనపై వివక్ష చూపించడమేనని వాదించారు.
తనకు అటెన్షన్ డెఫిషిట్/హైపరాక్టివిటీ డిజార్డర్ ఉందని, ఈ విషయాన్ని ఉద్యోగంలో చేరకముందే కంపెనీకి తెలియజేశానని షానన్ పేర్కొన్నారు.తన పరిస్థితిని సంస్థకు ముందుగానే తెలిసినా, దానిని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వాదించారు.
రూ.963 కోట్ల పరిహారం ఎందుకు?
ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ షానన్ బర్మింగ్‌హామ్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.తన తొలగింపు కారణంగా మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని ఆమె పేర్కొన్నారు.అంతేకాకుండా, ఈ పరిణామంతో టెక్ రంగంలో తన కెరీర్‌ను కొనసాగించలేకపోయానని, దాంతో భారీగా ఆదాయం కోల్పోయానని తెలిపారు.ఈ నష్టానికి పరిహారంగా గిట్‌పాడ్ నుంచి 76 మిలియన్ పౌండ్లు కోరారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.963 కోట్లకు పైమాటే. ఈ కేసుపై ట్రైబ్యునల్ ఇటీవల విచారణ చేపట్టింది.
కంపెనీ ఏమంటోంది?
షానన్ కోరుతున్న పరిహారాన్ని గిట్‌పాడ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెకు గరిష్ఠంగా 1 మిలియన్ పౌండ్లు మాత్రమే చెల్లించగలమని సంస్థ పేర్కొంది.76 మిలియన్ పౌండ్ల పరిహారం కోరడం అతిగా ఉందని, అంత భారీ మొత్తాన్ని చెల్లించడం తమకు సాధ్యం కాదని వాదించింది.ట్రైబ్యునల్ కీలక వ్యాఖ్యలు
అయితే గిట్‌పాడ్ వాదనపై ట్రైబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. గిట్‌పాడ్‌లో షానన్‌కు 0.85 శాతం వాటా ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది.అలాగే సంస్థ ఇటీవల ఓపెన్ఏఐతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంది.ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని షానన్ భారీ మొత్తంలో పరిహారం కోరడాన్ని పూర్తిగా అసమంజసమైన డిమాండ్‌గా చూడలేమని ట్రైబ్యునల్ పేర్కొంది.కేసుపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది.
చరిత్రలోనే భారీ పరిహారం కానుందా?
ఒకవేళ షానన్ బర్న్స్‌కు 76 మిలియన్ పౌండ్ల పరిహారం చెల్లించాలని ట్రైబ్యునల్ ఆదేశిస్తే.. బ్రిటన్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ చరిత్రలోనే అది అత్యంత భారీ పరిహారం అవుతుంది. అయితే తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.


