Homeక్రీడలుసూపర్-8లోనే ఓడిద్దాం

సూపర్-8లోనే ఓడిద్దాం

- Advertisement -

ఈసారి టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8 దశలోనే నువ్వా?నేనా? అని తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాయి. రెండేళ్ల నాటి ఓటమికి సఫారీ ప్రతీకారం తీర్చుకుంటుందా..? మరోసారి భారతే ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చూడాలి. గత రెండేళ్లలో ఇరు జట్లలో మార్పులు ఏంటి? ఈసారి ఎవరు హైలైట్‌గా నిలుస్తారో ఓ లుక్కేద్దాం. ఎప్పుడైనా సరే దక్షిణాఫ్రికా జట్టు ప్రమాదకరమే. భారత్‌ మాదిరిగానే సఫారీ టీమ్‌ కూడా గ్రూప్ స్టేజ్‌లో నాలుగుకు నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సూపర్ -8కి చేరింది. కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ 4 ఇన్నింగ్స్‌ల్లో 178 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అందరికంటే ఎక్కువగా ఫోర్లు (24) కొట్టిన బ్యాటరూ అతడే. అలాగని రికెల్‌టన్, డేవిడ్ మిల్లర్‌ను తక్కువగా అంచనా వేయకూడదు. నయా ఏడీబీగా పేరొందిన డెవాల్డ్ బ్రెవిస్‌ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తాడు. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లు కకావికలమే. ఆల్‌రౌండర్ జాబితాలో యాన్సన్‌ను తేలికగా తీసుకొంటే ముప్పు తప్పదు. ఓపెనింగ్‌ బౌలింగ్‌ వేసే అతడు.. లోయర్‌ ఆర్డర్‌లో భారీ షాట్లు కొట్టగల సమర్థుడు. యాన్సన్‌తోపాటు లుంగిడి ఎంగిడి, మఫాకా, నోకియా, కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌తో సవాల్ తప్పదు. గత టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టీ20 సిరీస్‌లు జరిగాయి. రెండింటినీ టీమ్ఇండియానే కైవసం చేసుకుంది. డిసెంబర్ 2024లో సౌతాఫ్రికాకు భారత్‌ వెళ్లింది. నాలుగు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-1తో గెలుచుకుంది. ఈ రెండు సిరీసుల్లోనూ తిలక్ వర్మ, వరుణ్‌ చక్రవర్తి టాప్ బ్యాటర్‌, బౌలర్‌గా నిలిచారు. ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న వీరిద్దరూ మరోసారి రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. భారత జట్టులో అభిషేక్ శర్మ మినహా.. మిగతావారంతా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. సూపర్‌-8లో అభిషేక్‌ నుంచి నిఖార్సైన ఇన్నింగ్స్‌ ఒక్కటి వస్తే చాలు.. అంతా సెట్ అవుతుంది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వరుణ్‌ చక్రవర్తి (9) రెండో స్థానంలో ఉన్నాడు. అత్యధిక పరుగుల లిస్ట్‌లో ఇషాన్ కిషన్ (176 రన్స్) టాప్-5లో ఉన్నాడు. సూర్య, తిలక్, హార్దిక్‌ మరోసారి బ్యాట్‌ను ఝళిపిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. ఇక్కడ జట్టు కూర్పే కీలకం కానుంది. ఫైనల్ XIలో ముగ్గురు స్పిన్నర్లకు చోటు ఇస్తుందా? ఇద్దరు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగుతుందో కూడా ఆసక్తికరమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు