అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర -అనంతపురం : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడలే స్ఫూర్తిగా పయనించాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, డిఆర్ఓ ఏ.మలోల అధికారులు, వివిధ బిసి సంఘ నాయకులు, ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల, పుష్పాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మహిళలు చదువుకుంటే వారి కుటుంబము బాగుంటుందని, సమాజం, దేశం బాగుంటుందని, అప్పటిలోనే స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి మహిళల కోసం ఓ ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాకుండా వారి శ్రీమతి అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి, వారిని ఆ పాఠశాలలో ఉపాధ్యాయ రాలినిగా చేసిన మహానీయుడని అన్నారు. ఈ భారతదేశంలో మహాత్మా అని ఇద్దరినీ అంటారని, ఒకడు మహాత్మా గాంధీ అయితే మరొకరు మహాత్మ జ్యోతిబా పూలే మాత్రమే అని సామాజిక సంస్కరణలు, మానవ హక్కులు, సమ సమాజ స్థాపన, మహిళల విద్యాభివృద్ధికి నాంది పలికిన మహాత్ముడని అన్నారు. వారి ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనపై ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణల నాంది పలికి, సామాజిక అసమానతల మీద పోరాటం చేసి మహాత్మా అని పేరు పొందినటువంటి మహానుభావుడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని అధికారికంగా జరుపుకోవాలని ఆదేశించారని, మహాత్మ జ్యోతిబా పూలే ఆదర్శ బాటలో మనమందరము నడవాలన్నారు. జిల్లాలో అక్షరాస్యత పెరగాలని, ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.
మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనంతపురం జిల్లా నందు స్వయం ఉపాధి పథకం ద్వారా అర్హులైన 477 మంది లబ్ధిదారులకు రూ. 11.61 కోట్ల మెగా చెక్ ను అందించే కార్యక్రమాలను చేపట్టుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, రామ్మోహన్, సోషల్ వెల్ఫేర్ జెడి రాధిక, జిల్లా పరిషత్ సీఈవో రామచంద్ర రెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, డిటిడబ్ల్యువో రామాంజనేయులు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, బిసి కార్పొరేషన్ డిడి సుబ్రమణ్యం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.