Homeజాతీయంపెళ్లైన కూతురూ కారుణ్య నియామకానికి అర్హురాలే

పెళ్లైన కూతురూ కారుణ్య నియామకానికి అర్హురాలే

- Advertisement -


వివాహమైన కుమార్తెను కుటుంబ పరిధి నుంచి వినహాయించలేం
సుప్రీం కోర్టు తీర్పు
న్యూదిల్లీ:
కుమార్తెకు పెళ్లయినంత మాత్రాన బంధం విడిపోదు. అంతటితో ఆమె బాధ్యత తీరిపోదు అని సర్వోన్నత న్యాయస్థానం గొప్ప తీర్పును వెలువరించింది. ‘కుటుంబ పరిధి నుంచి వివాహిత కుమార్తెను మినహాయించడం ఏకపక్షం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం’ అని తన తీర్పులో నిర్వచించింది. కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనంటూ జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధే ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తండ్రి మరణానంతరం అతని స్థానంలో చౌక ధరల దుకాణం లైసెన్స్‌ను తనకు కేటాయించాలన్న కుమార్తె అభ్యర్థనను ధర్మాసనం సమర్థించింది. ఆమెకు ప్రతికూలమైన తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలకు…వివాహమై అత్తగారింటికి వెళ్లిన కుమార్తెను పుట్టింటి కుటుంబ సభ్యురాలుగా పరిగణించరాదన్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వును రేషన్ షాపు డీలర్ కుమార్తె హైకోర్టులో సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించగా…సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రేషన్ షాపు డీలర్ మృతితో తల్లికి అండగా ఉంటూ ఆ కుటుంబ భారాన్ని పిటిషనర్ మోస్తున్నారని, వివాహమైనప్పటికీ పుట్టింట్లోనే ఉంటూ దివ్యాంగురాలైన సోదరి సంరక్షణతోపాటు కుటుంబ బాధ్యతలను మోస్తున్నారని సుప్రీంకోర్టు గుర్తించింది. తల్లి మరణానంతరం ఆ రేషన్ షాప్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. తండ్రి, తల్లి మృతితో కుటుంబ సభ్యులు పిటిషనర్‌పై ఆధారపడటం, చౌక ధరల దుకాణం ఉన్న గ్రామంలోనే పిటిషనర్ జీవిస్తున్న విషయాన్నీ ధర్మాసనం ప్రస్తావించింది. ఈ వాస్తవాలను అధికారులు కూడా అంగీకరించారని తెలిపింది. పిటిషనర్‌కు చౌక ధరల దుకాణం లైసెన్స్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. వివాహమైన కుమారుడు విడిగా దూరంగా ఉంటున్నప్పటికీ కుటుంబ సభ్యుడిగా పరిగణిస్తూ…కుమార్తె విషయంలో భిన్నంగా ఆలోచించడం లింగ వివక్షేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు