Friday, February 21, 2025
Homeజాతీయంమొదటి సినిమాకే గందరగోళంలో పడిన మోనాలిసా!

మొదటి సినిమాకే గందరగోళంలో పడిన మోనాలిసా!

సినిమాలో ఆఫర్ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా
డైరెక్టర్ మిశ్రాపై నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ తీవ్ర స్థాయి ఆరోపణలు
ఇరువురి వివాదంతో ప్రశ్నార్ధకంగా మోనాలిసా సినీ కెరీర్

ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయి సినిమా ఛాన్స్ కొట్టేసిన మోనాలిసా కొత్త వివాదంతో ఇబ్బంది పడుతోంది. దర్శకుడు, నిర్మాత మధ్య తలెత్తిన వివాదం కారణంగా తన మొదటి సినిమా ప్రాజెక్టుకు గ్రహణం పడుతుందేమోనని మోనాలిసా భయపడుతోంది. విషయంలోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి మోనాలిసా ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకునే చిరు వ్యాపారం చేస్తుండగా, ఒక నెటిజన్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ఫోటో వైరల్ అయింది. తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో కనిపించే మోనాలిసా నెటిజన్లను ఆకర్షించడంతో ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది. దీంతో కుంభమేళాకు వచ్చిన జనం ఆమెతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపడం, ఆ క్రమంలో ఆమెను ఇబ్బంది పెట్టడం లాంటివి కొందరు చేశారు. దీంతో ఆమె తన పూసల వ్యాపారానికి స్వస్తి పలికి స్వగ్రామానికి వెళ్లిపోయింది.ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రకటించాడు. ఆ వెంటనే మణిపూర్ నేపథ్యంలో ఆయన రూపొందించే సినిమాకి మోనాలిసా సంతకం కూడా చేసింది. ఈ సినిమా కోసం ఆమె ప్రస్తుతం యాక్టింగ్‌పై శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెతో చనువుగా ఉంటూ ఆమెకు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే మోనాలిసాతో సనోజ్ మిశ్రా చనువుగా ఉండటంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

మోనాలిసాను సనోజ్ మిశ్రా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడని, ఆమెను ట్రాప్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మిశ్రా స్పందిస్తూ మోనాలిసా తన కూతురు లాంటిదని, ఆమెకు తన కూతురు వయసు ఉంటుందని, ఆమెను తను వేధించడం లేదని, ఇష్టపూర్వకంగానే సినిమాలో నటిస్తోందని చెప్పుకొచ్చారు. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. దీనిపై నిర్మాత జితేంద్ర నారాయణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా విషయంపై దర్శకుడు, నిర్మాత మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో తన మొదటి సినీ ప్రాజెక్టుపై మోనాలిసా ఆందోళన చెందుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు