Homeసినిమా'నా అన్నయ్యే నా ఏకైక హీరో'.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!

‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.అన్నయ్యతో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న పవన్.. తన జీవితంపై చిరంజీవి చూపిన ప్రభావం, కుటుంబం కోసం ఆయన చేసిన త్యాగాలు, తమపై చూపించిన ప్రేమను ఈ పోస్టులో వివరించారు.చిరంజీవి హీరోగా మారకముందే తనకు హీరో అని పేర్కొంటూ అన్నయ్యపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తి..
చిరంజీవి కాలేజీ చదువుల కోసం నర్సాపూర్ వెళ్లిన రోజులను పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు.వేసవి సెలవులకు అన్నయ్య ఇంటికి తిరిగి వస్తే తమ ఇంట్లో పండుగ వాతావరణం ఉండేదని తెలిపారు.అదే సమయంలో ఆయన తిరిగి కాలేజీకి వెళ్లినప్పుడు ఇంట్లో విషాదం, వెలితి కనిపించేదని చెప్పారు.చిరంజీవి లేకపోతే ఇల్లు కళ తప్పినట్టుగా అనిపించేదని రాసుకొచ్చారు.తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో చిరంజీవి పక్కన నడవడమే తనకు ఎంతో గర్వంగా ఉండేదని పవన్ తెలిపారు.తాను కాలేజీలో చదువుతున్న సమయంలోనే చిరంజీవి తనకు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కనిపించేవారని పవన్ పేర్కొన్నారు.

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న పవన్..
తండ్రి బుల్లెట్ బైక్‌పై చిరంజీవి పొడవాటి జుట్టుతో, ఫిట్‌గా ఉన్న ఎన్‌సీసీ క్యాడెట్ శరీరాకృతితో, బెల్ బాటమ్ ప్యాంట్, కళ్లద్దాలతో కనిపిస్తే తాను ఓ ఫ్యాన్‌బాయ్‌లా భావించేవాడినని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభ దశలో తొలిసారి సింగపూర్ వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఓ పెద్ద నీలిరంగు బ్యాగ్ తీసుకొచ్చారని పవన్ తెలిపారు.అందులో తన కోసం చిన్న లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ క్యాసెట్లు, టేప్ రికార్డర్, యార్డ్లీ పౌడర్లు, సబ్బులు, పెర్ఫ్యూమ్స్ ఉన్నాయని చెప్పారు.కుటుంబ సభ్యుల కోసం కూడా చిన్నచిన్న బహుమతులు తీసుకొచ్చేవారని గుర్తుచేసుకున్నారు.చిరంజీవి తమ చిన్న ఇంట్లో ఎప్పుడూ ఆనందాన్ని, చిరునవ్వులను నింపేవారని పవన్ పేర్కొన్నారు.

గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న చిరూ..
చిరంజీవి పెళ్లి చేసుకున్న సమయంలో అన్నయ్య తమకు దూరమైపోతారేమోనని తాను బాధపడ్డానని పవన్ గుర్తుచేసుకున్నారు.ఓ గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో చిరంజీవి తన భార్య సురేఖను తీసుకొచ్చి.. “రా.. ఈరోజు నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాను” అని చెప్పారని తెలిపారు.ఆ సమయంలో చిరంజీవి, సురేఖ ఇద్దరూ నవ్వుతూ తన కన్నీళ్లకు కారణం తెలుసుకున్నారని పవన్ రాసుకొచ్చారు.ఆ తర్వాత తాను చెన్నైలో చిరంజీవి, సురేఖతో కలిసి ఉన్న రోజులను కూడా పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు.ఆ సమయంలో తనపై వారిద్దరూ చూపించిన ప్రేమ, శ్రద్ధను వివరించడానికి తన వద్ద సరిపడా పదాలు లేవని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు