Homeజిల్లాలుఅనంతపురంచెత్త వాహనాలు కార్యాలయంలో.. చెత్త కుప్పలు వీధుల్లో!….

చెత్త వాహనాలు కార్యాలయంలో.. చెత్త కుప్పలు వీధుల్లో!….

- Advertisement -

చెత్త కుప్పలతో నార్పల ప్రజలకు అవస్థలు…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల కేంద్రంలో చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో పలు వీధులు చెత్త కుప్పలతో దర్శనమిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పంచాయతీ చెత్త సేకరణ వాహనాలు అన్ని వీధుల్లో తిరగకపోవడంతో ఇంటింటా చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను తరలించే అవకాశం లేక కొందరు డ్రైనేజీ కాలువల్లో, మరికొందరు రోడ్ల పక్కన చెత్తను పారబోస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. చెత్త కుప్పల నుంచి దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త కుప్పల వద్ద వీధి కుక్కలు, పందులు సంచరిస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.
ప్రజల నుంచి ఇంటి పన్నులు, పారిశుధ్య రుసుములు వసూలు చేస్తున్న పంచాయతీ కనీస పారిశుధ్య సేవలను సక్రమంగా అందించడంలో విఫలమవుతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు స్వచ్ఛ గ్రామం అంటూ ప్రచారం చేస్తూ, మరోవైపు వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నా పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
చెత్త సేకరణ వాహనాలు పంచాయతీ కార్యాలయ ఆవరణలో కనిపిస్తున్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో విధుల్లోకి ఎందుకు పంపడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. వాహనాలు అందుబాటులో ఉండి కూడా చెత్త సేకరణ జరగకపోవడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి అన్ని వీధుల్లో క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి పారిశుధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ చెత్త సేకరణ వాహనాలు మరమ్మతులకు గురికావడంతో కొంత అంతరాయం ఏర్పడిందని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతం ఒక వాహనం నడుస్తోందని, మరో వాహనం ఈ సాయంత్రానికి సిద్ధమవుతుందని చెప్పారు. ట్రాక్టర్ మరమ్మతులకు సుమారు రూ.70 వేలు, మరో వాహనానికి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇంజిన్‌తో పాటు బాడీ, ప్లాట్‌ఫామ్ తదితర మరమ్మతు పనులు చేపడుతున్నామని, పెండింగ్ పనులు పూర్తి చేసి అన్ని వాహనాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు