కేంద్రం, సీబీఐ, ఎన్‌టీఏలకు నోటీసులు
ఎన్‌టీఏ ప్రక్షాళన కోరుతూ పిటిషన్ల దాఖలు
పర్యవేక్షణ కమిటీ సిఫార్సులపై కోర్టు ఆరా
మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) 2026 పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం (మే 25) ఘాటుగా స్పందించింది. పరీక్షల నిర్వహణలో విఫలమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరును తప్పుబడుతూ.. “ఇన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా మీరు పాఠం నేర్చుకోవడం లేదా?” అని ప్రశ్నించింది. వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షను ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిర్వహిస్తారని ధర్మాసనం నిలదీసింది.
ఎన్‌టీఏను మార్చాలని డిమాండ్
పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఫైమా, యూడీఎఫ్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. లోపభూయిష్టంగా మారిన ఎన్‌టీఏ స్థానంలో సరికొత్త వ్యవస్థను తీసుకురావాలని లేదా దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోర్టును కోరారు. నీట్ యూజీ పరీక్షలను కట్టుదిట్టంగా, స్వతంత్రంగా నిర్వహించేలా ఒక పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.
మూడు రోజుల్లో అఫిడవిట్
గత నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత పరీక్షల పర్యవేక్షణ కోసం కోర్టు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గతేడాది నవంబర్ 14న ఏర్పాటైన ఈ మానిటరింగ్ కమిటీ చేసిన సిఫార్సులను ఎంతవరకు అమలు చేశారో స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ కమిటీకి నేతృత్వం వహించిన జస్టిస్ రాధాకృష్ణన్ కూడా సిఫార్సుల అమలుపై తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్లను మూడు రోజుల్లోగా సమర్పించాలని గడువు విధించింది.


