నేపాల్‌లోని రసువా జిల్లాలో ఇటీవల సంభవించిన వరదల్లో మరణించిన విదేశీ పౌరుల మృతదేహాలను గుర్తించి, వారి బంధువులకు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన వివరాలను నేపాల్ అధికారులు విడుదల చేశారని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే మృతదేహాలను అప్పగిస్తారని స్పష్టం చేసింది.నేపాల్ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం.. మొదట మృతదేహాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేస్తారు. ఫొటోలు తీసి, పోస్టుమార్టం నిర్వహించి మరణానికి గల కారణాలను ధ్రువీకరిస్తారు. అనంతరం పాస్‌పోర్ట్, వేలిముద్రలు, డీఎన్ఏ వంటి ఫోరెన్సిక్ నమూనాల ఆధారంగా మృతుల గుర్తింపును అధికారికంగా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం సంబంధిత దేశాల రాయబార కార్యాలయాల సమన్వయంతో జరుగుతుందని, చివరగా హ్యాండోవర్ మెమోపై సంతకాలు తీసుకుని మృతదేహాలను అప్పగిస్తారని ఎంబసీ వివరించింది.
నేపాల్ పోలీస్ వెబ్సైట్లో ఉంచిన మృతుల ఫొటోలు, వివరాల ఆధారంగా బంధువులు ఎవరైనా గుర్తిస్తే, తదుపరి ప్రక్రియల కోసం స్థానిక అధికారులతో సమన్వయం చేసేందుకు ఖాట్మండులోని రాయబార కార్యాలయ అధికారులు సహాయం అందిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మృతదేహాలకు తాత్కాలికంగా ఖననం చేసినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఇలాంటి మృతదేహాలను గుర్తించాలంటే, మృతుల సమీప బంధువులతో డీఎన్ఏ సరిపోల్చడం తప్పనిసరి అని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఇందుకోసం బంధువులు తమ డీఎన్ఏ ప్రొఫైళ్లను dnacodis@nepalpolice.gov.np లేదా eoikathmandufloodsupport@gmail.com అనే ఈమెయిల్ ఐడీలకు పంపవచ్చు. లేదంటే నేరుగా రక్త నమూనాలు కూడా ఇవ్వొచ్చని సూచించింది.
సహాయం కోసం నేపాల్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్: +977 9841 6160 95, భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లు: +977 985 131 6807, +977 970 910 7500, +977 981 032 6117 లలో సంప్రదించాలని సూచించారు. ఆగస్టు 26న చైనాలోని టిబెట్ ప్రాంతంలో పుట్టిన ఈ ఆకస్మిక వరద, భోటే కోశి నది ద్వారా నేపాల్‌లోకి ప్రవేశించి పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో వందలాది మంది, అనేక మంది విదేశీయులు సహా ప్రాణాలు కోల్పోయారు.


