Saturday, February 22, 2025
Homeతెలంగాణఅలా చేస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుంది: హైకోర్టు తీవ్ర ఆగ్రహం

అలా చేస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుంది: హైకోర్టు తీవ్ర ఆగ్రహం

చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఏ ప్రక్రియ జరిగినా చట్టబద్ధంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు హైడ్రాపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికి రాత్రి నగరాన్ని మార్చలేమని, అక్రమ కట్టడాల విషయాలలోనూ చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చట్టాన్ని దాటుకొని, జీవో 99కి విరుద్ధంగా వెళితే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించకుండానే షెడ్డును కూల్చివేశారని పేర్కొంటూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె. లక్ష్మణ్ నిన్న విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

హైడ్రాను అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పత్రాలను చూసి హక్కులను నిర్ణయించే అధికారం హైడ్రాకు ఎక్కడ ఉందని ప్రశ్నించింది. కూల్చివేతల విషయంలో నోటీసులు ఇచ్చి, వివరణ ఇచ్చేందుకు గడువు ఇచ్చి, చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారడం లేదని అసహనం వ్యక్తం చేసింది.

పిటిషనర్ ప్రవీణ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు. కానీ ఈ నిర్మాణాలకు 2023 నవంబర్ 15న గ్రామ పంచాయతీ అనుమతులు జారీ చేసిందని హైకోర్టుకు తెలిపారు.

హైడ్రా తరఫు న్యాయవాది రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని, ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శి అనుమతులు రద్దు చేశారని అన్నారు. అన్ని పత్రాలను పరిశీలించాకే కూల్చివేసినట్లు హైకోర్టుకు తెలిపారు. రహదారులకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైడ్రా తరఫు న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బెదిరించి అనుమతులు తీసుకున్నారని ఎలా చెబుతారని ప్రశ్నించింది. 2023లో అనుమతులు ఇస్తే ఇన్నాళ్ల తర్వాత ఎలా రద్దు చేస్తారని నిలదీసింది. గత విచారణ సందర్భంగానే ఈ విషయాన్ని తమ దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని అడిగింది.

పార్కును కబ్జా చేసి ఉంటే హైడ్రా రాకముందు గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని, పార్కు ఆక్రమణలు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉందని, హైడ్రా వచ్చింది కాబట్టి ఫిర్యాదు చేయడమేమిటి? పార్కు స్థలం నిర్ణయించడానికి మీరెవరు? లేఅవుట్‌కు అనుమతులు మంజూరు చేయడానికి సర్పంచ్‌కి అధికారాలు ఎక్కడివి? పిటిషనర్‌ను కబ్జాదారని ఎలా చెబుతారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అనంతరం ప్రస్తుతం యథాస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ, పూర్తి వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు