తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీ దృష్టి పూర్తిగా తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై పడింది.విజయ్ తాను గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహణ అనివార్యంగా మారింది.
అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ
ఈ ఉపఎన్నికలో టీవీకే తరఫున ఎవరు పోటీ చేస్తారన్న అంశం గత కొన్ని రోజులుగా తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు బలంగా వినిపిస్తోంది.ప్రస్తుతం తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఆయననే పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలపై ప్రచారం జోరుగా సాగుతోంది.
త్రిష పేరుపై ముగిసిన ఊహాగానాలు
మొదట్లో ఈ స్థానం నుంచి స్టార్ హీరోయిన్ త్రిషను బరిలోకి దింపనున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.విజయ్‌తో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ తమిళ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం త్రిషకు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని స్పష్టమవడంతో ఆ ప్రచారానికి తెరపడింది.
లారెన్స్‌కు అనుకూలంగా పార్టీ లెక్కలు
రాఘవ లారెన్స్‌కు ఉన్న మాస్ ఇమేజ్, యువతలో ఆయనకున్న ఆదరణ, అలాగే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్న గుర్తింపు టీవీకేకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లారెన్స్ మొదటి నుంచే విజయ్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.
రజినీకాంత్‌తో చర్చించిన లారెన్స్?
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సాధించిన భారీ విజయాన్ని ఆయన బహిరంగంగానే అభినందించారు. అలాగే విజయ్ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు కూడా తన మద్దతు ప్రకటించారు
రాజకీయాల్లోకి ప్రవేశించే అంశంపై రాఘవ లారెన్స్ ఇప్పటికే తన గురువు, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చర్చించినట్లు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్ సూచనలు, ఆశీస్సులు తీసుకున్న తర్వాతే తన రాజకీయ అరంగేట్రంపై లారెన్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే టీవీకే అభ్యర్థి ఎంపికపై ఇప్పటివరకు పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
దీంతో తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో చివరకు ఎవరు బరిలోకి దిగుతారన్న ఉత్కంఠ కొనసాగుతోంది.


