విశాలాంధ్ర -ఉంగుటూరు( ఏలూరు జిల్లా): ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బొలెరో వ్యాన్ ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా , మరో ముగ్గురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయితీ పరిధిలో (తాడేపల్లిగూడెం- నల్లజర్ల రాష్ట్ర రహదారి లో) వెంకట రామన్నగూడెం ఉద్యానవన విశ్వవిద్యాలయం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున తాడేపల్లిగూడెం రహదారి వైపు ఆగి ఉన్న లారీని నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న బొలెరో వ్యాను వెనక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రమైన గాయాలతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన చిడిపి సాయి కుమార్ (22) గా గుర్తించారు. చేబ్రోలు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో వ్యాను తునాతునకులైంది.