1999 ఐసీ-814 విమాన హైజాక్ ఘటనలో జైషే మహమ్మద్ కమాండర్ రవూఫ్ కీలక సూత్రధారి
భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనగా నిలిచిపోయిన ఐసీ-814 కేసులో ప్రధాన సూత్రధారి, జైషే మహమ్మద్ (జెఇఎం) ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతమయ్యాడు. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సాయుధ బలగాలు అత్యంత చాకచక్యంగా నిర్వహించిన దాడుల్లో అతను మరణించినట్లు అత్యున్నత నిఘా వర్గాలు గురువారం ధృవీకరించాయి. ఈ పరిణామం భారత ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఒక కీలక మైలురాయిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడైన అబ్దుల్ రవూఫ్ అజార్, 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-814ను కాందహార్‌కు హైజాక్ చేసిన ఘటనలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల రాడార్‌పై ఉన్న ఇతను, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఉన్నాడు. ఇతడిని మట్టుబెట్టడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు గట్టి హెచ్చరిక పంపినట్లయిందని అధికార వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ బలగాలు ఃఆపరేషన్ సిందూర్ః ను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా, జైషే మహమ్మద్‌కు చెందిన అత్యంత కీలకమైన స్థావరంపై జరిపిన దాడిలో అబ్దుల్ రవూఫ్ అజార్ హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అతని మరణం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్‌వర్క్‌కు, ముఖ్యంగా జైషే మహమ్మద్ సంస్థకు కోలుకోలేని దెబ్బ అని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.