అమర్‌నాథ్ యాత్ర సందర్భంగానే అక్కడ భద్రత ఉంటుందని కేంద్రం వివరణ
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ప్రశ్నలు, సమాధానాల పర్వం నడిచింది. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను ప్రకటించిన మరుసటి రోజే, నిన్న సాయంత్రం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా ల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి, ముఖ్యంగా దాడి జరిగిన ప్రదేశంలో భద్రతా లోపాలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. దాడి జరిగిన బైసరన్ ప్రాంతంలో భద్రతా దళాలను ఎందుకు మోహరించలేదన్నది ప్రతిపక్షాల ప్రధాన ప్రశ్నగా నిలిచింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశాన్ని అధికారికంగా లేవనెత్తగా, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు నేతలు ఆయన వాదనకు మద్దతు పలికారు. ఉగ్రదాడికి ముందు ఆ నిర్దిష్ట ప్రదేశంలో భద్రతా సిబ్బంది లేకపోవడానికి గల కారణాలపై వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు లేవనెత్తిన సందేహాలకు కేంద్ర ప్రభుత్వం తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌లో ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు ముందుగానే బైసరన్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులు మార్గమధ్యంలో బైసరన్‌లో విశ్రాంతి తీసుకుంటారని, ఆ సమయంలో యాత్రికుల భద్రత కోసం ఆ మార్గాన్ని అధికారికంగా తెరిచి, భద్రతా దళాలను మోహరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. యాత్ర ప్రారంభానికి ముందే దాడి జరగడం, ఆ సమయంలో అక్కడ భద్రత లేకపోవడంపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా ప్రభుత్వం సమాధానమిచ్చింది.