Tuesday, April 29, 2025
Homeజాతీయంపహల్గామ్ దాడి.. వర్షం పడడంతో ఉగ్రవాదుల ప్లాన్ ఛేంజ్

పహల్గామ్ దాడి.. వర్షం పడడంతో ఉగ్రవాదుల ప్లాన్ ఛేంజ్

పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు తొలుత ఈ నెల 20న దాడి చేయాలని ప్లాన్ చేశారని, అయితే ఆ రోజు వ్యాలీలో భారీ వర్షం కురవడంతో దాడిని వాయిదా వేసుకున్నారని అధికారుల దర్యాఫ్తులో తేలింది. వర్షం కారణంగా పర్యాటకులు పెద్దగా రాకపోవడంతో ఉగ్రవాదులు దాడి చేయలేదని అధికారులు తెలిపారు. దాడికి ముందు ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారని, బైసరన్ వ్యాలీని పలుమార్లు సందర్శించారని చెప్పారు. దాదాపు వారం రోజులు ఆ పరిసరాల్లో తిరుగుతూ సమాచారం సేకరించారని అనుమానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి స్థానికంగా ఉన్న హోటళ్లు, దుకాణాలలోని సీసీ కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 22న బైసరన్ వ్యాలీలో పర్యాటకుల రద్దీ పెరిగే వరకూ ఉగ్రవాదులు ఎదురుచూశారని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ ఫుడ్ స్టాల్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు వేచి ఉన్నారని తెలిసిందన్నారు. అయితే, ఇక్కడ వేచి ఉండడానికి కారణం పర్యాటకుల రద్దీ కోసమేనా లేక ఏదైనా సంకేతం కోసమా అనే కోణంలో కూడా పరిశోధన చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పర్యాటకుల రద్దీ పెరిగాక షాపుల్లోకి వెళ్లి మారణకాండ సృష్టించారని చెప్పారు. సాధారణంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు కానీ బైసరన్ వ్యాలీలో మాత్రం బాధితుల తలను గురి చూసి కాల్చారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పర్యాటకులను మతం అడిగి ముస్లిమేతరులను వేరుగా నిలబెట్టి కాల్చి చంపారని వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు