మొత్తానికి కరాచీ నేషనల్ స్టేడియంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. చాంపియన్స్ ట్రోఫీలో ఆడే దేశాల పతాకాలు గడాఫీ స్టేడియంపై కనిపించగా, భారత మువ్వన్నెల పతాకం మాయమవడం వివాదానికి కారణమైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం భారత జట్టు తన జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించినప్పటికీ, పాకిస్థాన్ మాత్రం నిబంధనలను ఉల్లంఘించడం వివాదాస్పదమైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ట్రోఫీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలు స్టేడియంలో ప్రదర్శించడం ఆనవాయతీ కాగా, పాక్ దానిని ఉల్లంఘించింది. దాయాది దేశం కావాలనే భారత జెండాను విస్మరించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ విషయం వైరల్‌గా మారి విమర్శలు వెల్లువెత్తడంతో పాక్ ఎట్టకేలకు దిగొచ్చింది. దీంతో నిన్న భారత పతాకాన్ని స్టేడియంపై ఏర్పాటు చేసింది. ఐసీసీ ఆదేశాలతో పాక్ దిగివచ్చి ఈ వివాదానికి ముగింపు పలికినట్టు తెలిసింది. మ్యాచ్‌లు జరిగే రోజుల్లో నాలుగు జెండాలు మాత్రమే ఎగురవేయాలని ఐసీసీ సూచించిందని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఆ నాలుగు జెండాల్లో ఒకటి ఐసీసీ, రెండోది పీసీబీది కాగా, మిగతా రెండు ఆ రోజు పోటీపడే జట్లకు సంబంధించిన దేశాలవని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆతిథ్య దేశంలో భారత జెండాకు స్థానం దక్కిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రోఫీలో పాల్గొనే దేశాల జెండాలన్నీ అక్కడ ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కాగా, నేడు డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
దిగొచ్చిన పాక్.. కరాచీ స్టేడియంలో రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం
RELATED ARTICLES