ప్యారిస్/ ఇస్లామాబాద్: పాకిస్థాన్పై యునెస్కో ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఈ చారిత్రక కట్టడాల్లో చేపట్టిన పనులు అసలు నిర్మాణాల ప్రామాణికత, చారిత్రక విలువను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించింది. ఈ మేరకు పనులను వెంటనే నిలిపివేయకపోతే తక్షశిలను ‘వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్’ జాబితాలో చేర్చడంతో పాటు, అవసరమైతే ప్రపంచ వారసత్వ హోదానూ రద్దు చేస్తామని పాకిస్థాన్ అధికారులను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓ పర్యాటకుని ఫిర్యాదు మేరకు జూన్ 12న యునెస్కో ప్రతినిధులు, పాకిస్థాన్ పురావస్తు శాఖ, జాతీయ వారసత్వ మంత్రిత్వశాఖ అధికారులు కలిసి తక్షశిల మ్యూజియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మొహ్రా మొరాడు, సిర్కాప్ ప్రాంతాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన పూర్తి సాంకేతిక పత్రాలను పంజాబ్ పురావస్తుశాఖ సమర్పించలేకపోయినట్లు సమాచారం. ప్రపంచ వారసత్వ కట్టడాల గోడలను సిమెంట్‌తో నిర్మించడం, పురాతన గోడల స్థానంలో కొత్త రాతి నిర్మాణాలు చేపట్టడం, గోడల ఎత్తును పెంచడం వంటి చర్యలు యునెస్కో నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. పాత రాళ్లకు, కొత్త నిర్మాణ సామగ్రికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఇటువంటి మార్పులు చేయడం తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తామని యునెస్కో స్పష్టం చేసింది. ప్రపంచ వారసత్వ హోదా పోయి, డేంజర్ లిస్ట్‌లో చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు…
పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండి జిల్లాలో ఉన్న తక్షశిల…దక్షిణాసియాలోనే అత్యంత ప్రాచీన బౌద్ధ విద్యా కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 1980లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. క్రీ.పూ.6వ శాతాబ్దంలో ఉనికిలోకి వచ్చిన విశ్వవిద్యాలయం. కాలక్రమేణ వేద విద్య, బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లింది. పాణిని, కౌటిల్యుడు, జీవకుడు వంటి ప్రముఖులు ఇక్కడ బోధనలు అందించారు. మెసోలిథిక్ కాలానికి చెందిన గుహ, నాలుగు ప్రాచీన పట్టణాల అవశేషాలు, బౌద్ధ విహారాలు, మసీదు, మదరసా వంటి నిర్మాణాలతో ఈ ప్రాంతం విశేష చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. భారత ఉపఖండంలోని పట్టణ నాగరికత అభివృద్ధికి తక్షశిల ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందని యునెస్కో పేర్కొంటోంది
తక్షశిలకు పాక్ మరమ్మతులు…యునెస్కో ఆగ్రహం
- Advertisement -
RELATED ARTICLES


