వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రముఖ సినీ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)ని అధికారంలోకి తెచ్చే బాధ్యతను ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భుజానికెత్తుకున్నారు. విజయ్ తో చేతులు కలిపిన పీకే… టీవీకే తరపున వ్యూహాలను రచిస్తున్నారు. బీజేపీ, డీఎంకే రెండూ తనకు శత్రువులని విజయ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ కి ప్రశాంత్ కిశోర్ కీలక సూచనలు చేసినట్టు సమాచారం. అన్నాడీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి సీఎం పదవి, విజయ్ కు డిప్యూటీ సీఎం పదవిని పీకే సూచించినట్టు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజయ్ రాజీ పడాల్సిన పరిస్థితి ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. రాష్ట్రంలో శాశ్వత ఓటు బ్యాంకు ఉన్న అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటు చేస్తేనే డీఎంకేను నిలువరించడం సాధ్యమవుతుందని విజయ్ కి పీకే చెప్పారట. ఇదే అంశంపై అన్నడీఎంకేతో కూడా ప్రశాంత్ కిశోర్ మాట్లాడినట్టు సమాచారం. ప్రస్తుతం అన్నాడీఎంకేకు 25 శాతం ఓట్లు, టీవీకేకు అత్యధికంగా 20 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని… ఇతర పార్టీలను కూడా కలుపుకుంటే 50 శాతం ఓట్లు వస్తాయని విజయ్ కి పీకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాల గురించి విజయ్ కి పీకే వివరించారని సమాచారం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుని ఏపీలో ఘన విజయం సాధించారని… అదే విధంగా అన్నాడీఎంకే, టీవీకే పొత్తు పెట్టుకోవాలని సూచించారట. పళనిస్వామికి సీఎం పదవిని ఇచ్చి, మీరు డిప్యూటీ తీసుకోవాలని చెప్పారట. పీకే సూచనలకు విజయ్ సానుకూలంగా స్పందించారని టీవీకే నేతలు కొందరు తెలిపారు.