సిడిపిఓ శ్రీలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; తల్లిదండ్రులు పిల్లల సమస్యల గురించి సకాలంలో స్పందించినప్పుడే మంచి ఫలితం ఉంటుందని సిడిపిఓ శ్రీ లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, ఐసిడిఎస్ జిల్లా బాలల పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో
నేటితరం పిల్లలు ఆన్లైన్ వేధింపులకు గురి కాకుండా ఎలాంటి విధి విధానాలు నిర్వహించాలి ? అన్న విషయంపై పోతుకుంట స్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీఓ శ్రీలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల సమస్యలు గురించి సకాలంలో స్పందించాలి అని,స్పందించకపోతే వేరే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలిపారు. పెద్దలు పిల్లల కోసం సమయం కేటాయించకపోతే జరిగే పరిణామాలు గురించి వివరించారు. పిల్లలలో మానసిక సంఘర్షణ మొదలవుతుంది అని, పిల్లలతో పెద్దలు గడపడం లేదని, మొబైల్ వాడకం ఎక్కువ అవుతుంది అని తెలిపారు.పిల్లల ప్రవర్తనలో విపరీతమైన మార్పులు రావడం, పిల్లలు ఒంటరిగా ఉండలను కోవడం,తన అభిరుచులకు అనుగుణంగా ఉన్న వారిని ఏరి కోరి ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
విష సంస్కృతిని పెంపొందించుకోవడం, చుట్టూ ఉన్న ప్రభావితం చేసే అంశాలకు గురి కావడం జరుగుతుందని తెలిపారు. అందుకోసం పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పిల్లలు చెప్పేది సావధానంగా వింటూ వారికి తోడుగా ఉండే విధంగా చూసుకోవాలని తెలియ చేశారు.అంతే కాకుండా పిల్లలు ప్రవరించే తీరుని బట్టి అనుమానంతో, భయంతో పిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారు అని వాపోయారు. ఏ ఇంట్లో అయితే పిల్లల కోసం కాకుండా పిల్లల తోటి జీవిస్తారో ఆ ఇంట్లో పిల్లలు సురక్షితంగా ఉంటారని తెలిపారు. ఆ పిల్లలు భావి భారతవనికి ఉపయోగపడతారని తెలిపారు. ఒకవేళ పిల్లలకు ఆన్లైనులో ఎవరి నుండైనా ప్రమాదం పొంచి ఉంది అని అనుమానం కలిగితే సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫోన్ చేయాలని తెలిపారు. అలాంటి వారి పట్ల చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా కృషి చేయాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ కొండప్ప, సూపర్వైసర్ అరుణ, కౌన్సెలర్ శివలత, యూత్ అంబాసిడర్ సంజీవరాయుడు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు పిల్లల సమస్యలు గురించి సకాలంలో స్పందించాలి..
RELATED ARTICLES