పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది
అధికారంలో ఉన్నప్పుడు మనపై ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది.
పార్టీ శ్రేణులకు పరిటాల శ్రీరామ్ దిశా నిర్దేశం
విశాలాంధ్ర- ధర్మవరం : ప్రజలు మా కంటే ఎక్కువగా స్థానిక నాయకులైన మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారని.. వారి సమస్యలు తీర్చే బాధ్యత కూడా మనపై ఉంటుందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని టిడిపి కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్-కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ కాలనీలకు చెందిన ప్రజలు కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించి శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటినీ కచ్చితంగా పరిష్కరించే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సమావేశంలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 9నెలలు గడిచిందని, ఇక నుంచి మనం క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే అధికారంలో ఉన్నప్పుడే మనపై బాధ్యత ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేశారని… ఏదైనా సమస్య వస్తే పరిష్కరిస్తారనే నమ్మకం వారికి ఉంటుందని,ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం పని చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. పార్టీలో పదవులు ఇతర పనులు జరగడం లేదన్న ఆవేదన కొంతమందికి ఉందన్నారు. అయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు మనకు కొన్ని పరిమితులు ఉంటాయని కార్యకర్తలు వాటిని అర్థం చేసుకోవాలన్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో ఎక్కువమందికి పదవులు వస్తే… అది ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇకనుంచి ప్రతి ఒక్కరు తమ వార్డు, గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లాలన్నారు. వారి సమస్యలను సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలని వారు దిశా నిర్దేశం చేశారు.
12మందికి రూ.7.68 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన శ్రీరామ్బీబీ
ధర్మవరం నియోజకవర్గంలో వివిధ కారణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 12మందికి 7లక్షల 68వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ధర్మవరం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఈ చెక్కులను అందించగా, వారు శ్రీరామ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముదిగబ్బ మండలంలో ముగ్గరికి, ధర్మవరం పట్టణంలోని 5మందికి, ధర్మవరం మండలంలోని నలుగురికి ఈ సాయం అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆరోగ్యం విషయంలో ఖర్చులు చూడటం లేదన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద సాయం అడిగిన వెంటనే స్పందిస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇది అని వారు స్పష్టం చేశారు.