టారిఫ్ ల సవరణతో ధరలు పెరిగే అవకాశం
ధరలు పెరగకముందే కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు
అమెరికాలోని షాపింగ్ మాల్స్ గత కొన్ని వారాలుగా కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దిగుమతులపై విధిస్తున్న సుంకాలే. దిగుమతి సుంకాల పెంపు కారణంగా ధరలు పెరగనుండడంతో, వస్తువుల ధరలు పెరగకముందే కొనుగోలు చేసేందుకు ప్రజలు షాపింగ్ మాల్స్ కు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లు భారీగా పెరిగాయని పలు సర్వేలు చెబుతున్నాయి.
కొత్త టారిఫ్ విధానం కారణంగా తైవాన్ నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుమారు 32% వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, కెమెరాలు వంటి వస్తువులు ధరలు భారీగా పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. దాంతో, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ప్రజలు భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయంతో ముందస్తు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
టెక్సాస్‌కు చెందిన జాన్ గుటిరెచ్ అనే యువకుడు మాట్లాడుతూ తైవాన్ బ్రాండ్ ల్యాప్‌టాప్‌ను కొనాలని అనుకున్నానని, సుంకాల గురించి తెలియగానే వెంటనే ఆర్డర్ చేశానని తెలిపాడు. కార్లు, గృహోపకరణాలకు కూడా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని పలు కంపెనీలు వెల్లడించాయి.
ఈ పరిస్థితిపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుంకాల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి… నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రారంభంలో 10% సుంకం వసూలు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ 10 నుంచి విధిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే, కొన్ని దిగుమతులకు మే 27 వరకు గ్రేస్ పీరియడ్ ఉండటంతో ఆ లోపు సరుకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.