తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, జగన్ నివాసం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు
ఆదివారం నాడు 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిన పోలీసులు
తాడేపల్లి పీస్ లోని మానిటర్ కు సీసీ కెమెరాల అనుసంధానం
ఈ నెల 5న జగన్ నివాసం పక్కనున్న వైసీపీ ఆఫీస్ ఎదుట గార్డెన్ లో అగ్నిప్రమాదం
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం జగన్ నివాసం వద్ద పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ నెల 5న జగన్ నివాసం పక్కనున్న వైసీపీ ఆఫీస్ ఎదుట గార్డెన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ఆ పార్టీ వర్గాలు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని పోలీసులు ఆఫీస్ సిబ్బందిని అడిగారు. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ భద్రతా చర్యల్లో భాగంగా నిఘా ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు అక్కడ 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వాటిని తాడేపల్లి పీస్ లోని మానిటర్ కు అనుసంధానించడం జరిగింది.
ఇక వైసీపీ కార్యాలయం ఎదుట ఉన్న గార్డెన్ లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయా మార్గాల్లోని సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మట్టి, బూడిద నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు.