గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఉదయం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు, వంశీని రెండు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, రెండు రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో అధికారులు ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాపులపాడులో అర్హులైన పేదలకు కాకుండా, నకిలీ పట్టాలు సృష్టించి పంపిణీ చేశారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు గతంలోనే పీటీ వారెంట్ దాఖలు చేసి, వంశీని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
కాగా, వల్లభనేని వంశీ ఇప్పటికే పలు ఇతర కేసుల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. తాజా పరిణామంతో నకిలీ పట్టాల కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.