వాటికన్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస
మృతిని అధికారికంగా ధ్రువీకరించిన వాటికన్ వర్గాలు
రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గౌరవించే క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 గంటలకు వాటికన్‌లోని తన నివాసమైన కాసా శాంటా మార్టాలో ఆయన తుది శ్వాస విడిచినట్లు వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. గత కొంతకాలంగా పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యుమోనియా, కిడ్నీ సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరి 38 రోజుల పాటు చికిత్స పొంది, గత నెలలోనే డిశ్చార్జ్ అయ్యారు. అర్జెంటీనాలో జన్మించిన ఆయన, దక్షిణ అమెరికా నుంచి పోప్ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రజల పోప్‌గా పేరుగాంచిన ఆయన, సామాజిక అంశాలపై తన గళం వినిపించేవారు. ఆశ్చర్యకరంగా, మరణించడానికి కొన్ని గంటల ముందు ఈస్టర్ పర్వదినాన సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో వేలాది మంది భక్తులకు ఆయన సందేశం ఇచ్చారు. అనారోగ్యం తర్వాత అంతమంది ప్రజల మధ్యకు రావడం అదే తొలిసారి. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా కేథలిక్ సమాజం విషాదంలో మునిగిపోయింది. కార్డినల్ ఫారెల్ ఆయన మృతిని ప్రకటిస్తూ, పోప్ ఫ్రాన్సిస్ జీవితం ప్రభువుకు, చర్చికి సేవ చేయడానికే అంకితమైందని పేర్కొన్నారు.