రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన
ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని, ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సి అవసరం చాలా ఉందని అన్నారు. లేకపోతే, రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ఇదే సమస్యగా ఉందని తెలిపారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండే దేశాల్లో ఉత్పాదకత తగ్గిపోతుంటుందని వివరించారు. జనాభా వృద్ధి చెందడం అత్యంత ముఖ్యమైన అంశం అని స్పష్టం చేశారు. దేశంలో రెండో తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. గత ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించి రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి పోయింది. నాయకుడు విధ్వంసం సృష్టిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే సమాజం బాగుంటుంది. అప్పట్లో నేను ఐటీ రంగాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు తెలుగువారు ప్రపంచంలోని ప్రతీ దేశంలో సత్తా చాటుతున్నారు.
మట్టిలో మాణిక్యాల్లాంటివారు మన పిల్లలు. బాగా చదివిస్తే ప్రపంచాన్ని ఏలుతారు. ఇప్పుడు ఏపీలో సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. సంపదను సృష్టించి అందరికీ పంచుతాం. అట్టడుగున ఉన్న 25 శాతం మంది పేదల కోసమే పీ4 తీసుకువచ్చాం… అని చంద్రబాబు వివరించారు.