ఉక్రెయిన్ శాంతి చర్చల పునరుద్ధరణే ప్రధాన అంశం
చర్చలు ఫలప్రదంగా జరిగాయన్న రష్యా అధ్యక్షుడు పుతిన్
శాంతి ఒప్పందం కోసం ముసాయిదా ప్రతిపాదిస్తామన్న రష్యా
కాల్పుల విరమణ చర్చలు వెంటనే ప్రారంభమవుతాయన్న ట్రంప్రష్యా-ఉక్రెయిన్ మధ్య గత మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సోమవారం జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ ఉద్రిక్తతల నడుమ కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ చర్చలు ఫలప్రదంగా, నిష్కపటంగా జరిగాయని పుతిన్ స్వయంగా వెల్లడించారు. నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించడమే ఈ సంభాషణ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. ఈ సంభాషణ అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చర్చలు చాలా సమగ్రంగా జరిగాయి. ఇది చాలా ఉత్పాదకమైన మార్పిడి అని నేను నమ్ముతున్నాను, అని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చల పునఃప్రారంభానికి అమెరికా అందిస్తున్న మద్దతుకు ట్రంప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధ వాతావరణాన్ని ముగించడం, కాల్పుల విరమణ అవకాశాలపై అమెరికా అధ్యక్షుడి అభిప్రాయాలను పంచుకున్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారానికి రష్యా కూడా మద్దతు ఇస్తుందని నేను స్పష్టం చేశాను, అని పుతిన్ వివరించారు.
భవిష్యత్ శాంతి ఒప్పందం కోసం ఒక మెమోరాండం ముసాయిదాను రష్యా ప్రతిపాదించి, ఉక్రెయిన్‌తో చర్చిస్తుందని ఇరు నేతలు అంగీకరించినట్లు పుతిన్ తెలిపారు. ఈ ముసాయిదాలో పరిష్కార సూత్రాలు, శాంతి ఒప్పందానికి పట్టే సమయం, అవసరమైన ఒప్పందాలు కుదిరితే తాత్కాలిక కాల్పుల విరమణ వంటి అంశాలు ఉంటాయి, అని ఆయన పేర్కొన్నారు. ఇస్తాంబుల్ చర్చల్లో పాల్గొన్న వారి మధ్య మళ్లీ సంప్రదింపులు ప్రారంభమయ్యాయని, ఇది సరైన దిశలో పయనిస్తున్నామనే ఆశాభావాన్ని కలిగిస్తోందని పుతిన్ అన్నారు. ఈ సంక్షోభానికి మూల కారణాలను తొలగించడమే మాకు అత్యంత ముఖ్యం, అని ఆయన పునరుద్ఘాటించారు.