Thursday, May 29, 2025
Homeఅంతర్జాతీయంపుతిన్‌,జెలెన్‌స్కీ డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

పుతిన్‌,జెలెన్‌స్కీ డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఇద్దరినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అప్పట్లో తాను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధం అసలు మొదలయ్యేదే కాదని స్పష్టం చేశారు. వారాంతంలో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన భారీ వైమానిక దాడుల్లో చిన్నారులతో సహా పలువురు పౌరులు మరణించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో ట్రంప్ స్పందిస్తూ.. ఒకప్పుడు పుతిన్‌తో తనకు మంచి సంబంధాలు ఉండేవని, కానీ ఇప్పుడు ఆయనకు పూర్తిగా పిచ్చిపట్టింది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నాకు ఎప్పుడూ మంచి సంబంధాలే ఉండేవి. కానీ ఆయనకు ఏదో అయింది. ఆయనకు పూర్తిగా మతి స్థిమితం తప్పింది! సైనికులనే కాదు, అనవసరంగా చాలా మందిని చంపేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని నగరాలపైకి ఎలాంటి కారణం లేకుండానే క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నారుఁ అని ట్రంప్ రాసుకొచ్చారు. అంతేకాకుండా, పుతిన్ ఉక్రెయిన్‌లో కొంత భాగాన్ని కాదు, మొత్తం ఉక్రెయిన్‌ను కోరుకుంటున్నారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బహుశా అదే నిజమని ఇప్పుడు రుజువవుతోంది. కానీ ఆయన అలా చేస్తే, అది రష్యా పతనానికి దారితీస్తుంది! అని ట్రంప్ హెచ్చరించారు.

అమెరికా మౌనం పుతిన్‌కు ధైర్యాన్నిస్తోందంటూ ఇటీవల జెలెన్‌స్కీ చేసిన ఆరోపణలకు కూడా ట్రంప్ బదులిచ్చారు. జెలెన్‌స్కీ మాటతీరును తప్పుబడుతూ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఇలా మాట్లాడటం ద్వారా తన దేశానికి ఎలాంటి మేలు చేయడం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా సమస్యలను సృష్టిస్తోంది. నాకది నచ్చడం లేదు, ఇకనైనా ఇది ఆగాలి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణ చెలరేగిన సమయంలో నేను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం ఎప్పటికీ మొదలయ్యేది కాదు అని ట్రంప్ స్పష్టం చేశారు.

రష్యా వైమానిక దాడులపై ఆదివారం సాయంత్రం వరకు మౌనంగా ఉన్న ట్రంప్.. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ పుతిన్‌పై విమర్శలు చేశారు. ఆయన చాలా మందిని చంపుతున్నారు. ఆయనకేమైందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఆయనకు ఏమైంది? చాలా మంది ప్రాణాలు తీస్తున్నారు. ఈ విషయం నాకు సంతోషాన్నివ్వడం లేదుఁ అని పుతిన్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు.

ఈ వివాదం నుంచి తనను తాను దూరం చేసుకునే ప్రయత్నం చేసిన ట్రంప్ ఈ యుద్ధానికి జెలెన్‌స్కీ, పుతిన్, అప్పట్లో తన తర్వాత అధ్యక్షుడైన జో బైడెన్‌లే బాధ్యులని పునరుద్ఘాటించారు. ఇది జెలెన్‌స్కీ, పుతిన్, బైడెన్‌ల యుద్ధం.. ట్రంప్ యుద్ధం కాదు. తీవ్ర అసమర్థత, విద్వేషం వల్ల మొదలైన ఈ భయంకరమైన మంటలను ఆర్పడానికి మాత్రమే నేను సహాయం చేస్తున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు.

ఫిబ్రవరి 2022లో పూర్తిస్థాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య జరిగిన అతిపెద్ద ఖైదీల మార్పిడి (ఇరువైపులా సుమారు 1,000 మంది ఖైదీల విడుదల) జరిగిన కొద్ది రోజులకే రష్యా ఈ దాడులకు పాల్పడింది. వాయవ్య జైటోమిర్ ప్రాంతంలో జరిగిన తాజా దాడుల్లో ఎనిమిది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులతో పాటు 17 ఏళ్ల టీనేజర్ మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు ధ్రువీకరించారు.

ఇటీవలి హింసాత్మక ఘటనల నేపథ్యంలో రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించే అంశాన్ని తాను పరిశీలిస్తున్నట్టు కూడా ట్రంప్ సూచించారు. అయితే, ఈ విషయంలో ట్రంప్ వైఖరి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కాంగ్రెస్‌కు ఈ వారం మొదట్లో వెల్లడించిన దానికి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. చర్చలకు రష్యాను నిరుత్సాహపరిచే అవకాశం ఉన్నందున, ఈ సమయంలో ఆంక్షలు విధిస్తామని బెదిరించడం సరికాదని ట్రంప్ భావిస్తున్నట్టు రూబియో చెప్పారని సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు