ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెంచుతోంది.ప్రభుత్వాలు కావాలనే కొందరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఆప్ నేత రాఘవ్ చద్దా పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన పేరు తొలగించడంపై చద్దా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
క్లరికల్ తప్పిదం కాదన్న చద్దా
SIR ప్రక్రియలో తన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సాధారణంగా జరిగే క్లరికల్ పొరపాటు కాదని రాఘవ్ చద్దా ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను వీడి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ నాయకత్వం తనపై రాజకీయ కక్ష పెంచుకుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ రాజకీయ విభేదాల ప్రభావం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలోనూ కనిపిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల జాబితా తయారీలో పాల్గొనే అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం ఉండే అవకాశం ఉందని చద్దా పేర్కొన్నారు. అందుకే తన పేరును షిఫ్టెడ్‌గా ఎందుకు గుర్తించారో పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రూల్స్‌ను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారంటూ..
తన పేరును ఏదైనా కారణంతో ఫ్లాగ్ చేసినా.. మార్గదర్శకాల్లోని నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులకు ఉన్న ప్రత్యేక రక్షణ కారణంగా తన పేరును డ్రాఫ్ట్ ఓటర్లజాబితాలో కొనసాగించాల్సి ఉందని వాదించారు. ఈనిబంధనను తన విషయంలో కావాలనే అమలు చేయలేదని ఆరోపించారు.
SIR మార్గదర్శకాల్లోని పారా 4(d)ను కూడా రాఘవ్ చద్దా ప్రస్తావించారు.
ఎంపీలు,ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధుల పేర్లు ఎన్నికల డేటాబేస్‌లో ఫ్లాగ్ అయినప్పటికీ.. క్లెయిమ్స్,అభ్యంతరాల దశలో అవసరమైన పత్రాలను సమర్పించుకునేందుకు వీలుగా వారి పేర్లను డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చేర్చాలని ఈ నిబంధన చెబుతోందని ఆయన వివరించారు. తాను పంజాబ్ నుంచి సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడినని చద్దా గుర్తుచేశారు. అయినప్పటికీ తన పేరును డ్రాఫ్ట్ జాబితాలో కొనసాగించకుండా షిఫ్టెడ్‌గా పేర్కొనడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.
20.66 లక్షల పేర్లు తొలగింపు
తన విషయంలో ఈ నిబంధనను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని అన్నారు. పంజాబ్‌లో SI= ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి మొత్తం 20.66 లక్షల పేర్లను తొలగించారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు, మరణించినవారు, ఒకటికి మించి నమోదైన డూప్లికేట్ ఓటర్లు ఇందులో ఉన్నారు. తొలగించిన పేర్ల సంఖ్య రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 9.7 శాతంగా ఉంది. రాఘవ్ చద్దా పేరును కూడా’ఆబ్సెంట్, షిఫ్టెడ్, డిజీస్డ్ అండ్ డూప్లికేట్’ (ASDD) జాబితాలో చేర్చారు. అందులో ఆయనను పర్మినెంట్లీ షిఫ్టెడ్‌గా గుర్తించారు.
చద్దా ఆరోపణలను ఖండించిన ఆప్
అయితే రాఘవ్ చద్దా చేసిన ఆరోపణలను అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. SIR ప్రక్రియను ఎన్నికల సంఘమే నిర్వహిస్తోందని, ఇందులో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని ఆప్, ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు చద్దా తన ఓటరు నమోదును ఢిల్లీకి మార్చుకునేందుకు ప్రయత్నించారని ఆప్ ఆరోపించింది. దీంతో ఓటర్ల జాబితాలో ఆయన పేరు తొలగింపు వ్యవహారం బీజేపీ, ఆప్ మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమైంది.
తుది జాబితా ఇంకా విడుదల కాలేదు: ఈసీ
ప్రస్తుతం అందుబాటులో ఉన్నది డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మాత్రమేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పేర్లు తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు క్లెయిమ్స్ దాఖలు చేసుకునే అవకాశం రాఘవ్ చద్దాతో పాటు మిగతా ఓటర్లకు కూడా ఉందని తెలిపింది. సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్‌లో తుది ఓటర్లజాబితాను విడుదల చేస్తామని పేర్కొంది. తన పేరుఃషిఫ్టెడ్గా ఎలా నమోదైందనే విషయంపై రాఘవ్ చద్దా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలను సేకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు SI= ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని ఆప్ మరోసారి స్పష్టం చేసింది. దీంతో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చద్దా పేరు లేకపోవడం అంశం రాజకీయంగా మరింత వేడెక్కింది.


