Saturday, January 11, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా, చాలా ప్రాంతాల్లో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కొన్నిచోట్ల ఆరుగురితోనే సచివాలయాలు పనిచేస్తున్నాయి. రేషనలైజేషన్‌లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్‌గా వీరిని విభజించాలనేది ప్రతిపాదన. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి విలేజ్ సెక్రటేరియట్ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ వస్తారు. అలాగే వార్డు సెక్రటేరియట్‌లో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.

టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు. 2,500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు.

ఇక 2,500 నుంచి 3,500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు. 3,501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు. ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే 2,500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 2,500 నుంచి 3,500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.

3,500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6,054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఈ అంశాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ ఒకరిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సూచించారు. వీరి ద్వారా ఎఐ, డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సెక్రటరీ ద్వారా గ్రామాల్లో, వార్డుల్లో టెక్నాలజీ పరంగా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. కనీసం 2,500 జనాభాకు లేదా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలని సీఎం సూచించారు. ఏజెన్సీలలో అవసరం అయితే అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు.

గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొత్తవిధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు. కొత్త విధానం అమలు చేస్తే 15 వేల మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉంటారు. వీళ్లలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారికి శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం సూచించారు. అదే విధంగా ప్రజల సమాచారం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమాచారం లేని ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే పక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు రియల్‌టైమ్ గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

సచివాలయాల పనితీరును అంచనా వేసి వారికి తగిన విధంగా బహుమతి ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శి/వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ విభాగానికి అధిపతిగా ఉంటారు. సచివాలయాలు నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమ అభివృద్ధి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి, విలువ జోడింపు వంటి వాటికి కేంద్రంగా ఉండాలన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలన్నారు. జనవరి 20, 2025 నాటికి గృహాలన్నీ జియో-ట్యాగింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని ఆదేశించారు. పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చెయ్యాలన్నారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వ్యక్తుల గురించి సర్వే చేయాలని చంద్రబాబు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు