Homeతెలంగాణబాలాపూర్‌కు ముందే రికార్డు మోత.. హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ!

బాలాపూర్‌కు ముందే రికార్డు మోత.. హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ!

- Advertisement -

హైదరాబాద్‌లో గణేశ్ లడ్డూ వేలం పాటలో మరోసారి భారీ ధర నమోదైంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కీర్తి రిచ్‌మండ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన వేలంలో గణపతి లడ్డూ ఏకంగా రూ.1.01 కోట్లు పలికింది. ప్రతి ఏటా పోటాపోటీగా జరిగే ఈ వేలంలో ఈసారి శక్తిమాన్‌ బృంద సభ్యులు లడ్డూను కైవసం చేసుకున్నారు.కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో లడ్డూ వేలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కమ్యూనిటీ వాసులు నాలుగు గ్రూపులుగా విడిపోయి ప్రతి ఏటా పోటీ పడుతుంటారు. ఈసారి కూడా అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో శక్తిమాన్ బృందం విజయం సాధించింది. గతేడాది (2025) ఇదే కమ్యూనిటీలో లడ్డూ రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లు పలకడం గమనార్హం. ఆ రికార్డుతో పోలిస్తే ఈసారి ధర తక్కువే అయినప్పటికీ, కోటి రూపాయల మార్క్‌ను దాటడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. స్వామివారి లడ్డూను దక్కించుకోవడం వల్ల శుభం, ఐశ్వర్యం కలుగుతాయనే బలమైన విశ్వాసంతో భక్తులు ఎంతటి ధరకైనా వెనుకాడటం లేదు. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలలో లడ్డూ వేలం పాటలు కోట్లలో జరుగుతుండగా, ఇప్పుడు అందరి దృష్టి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డూ వేలంపై కేంద్రీకృతమైంది. రేపు చారిత్రక బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం జరగనుంది. 1994లో కేవలం రూ.450తో మొదలైన ఈ వేలం ప్రస్థానం, మూడు దశాబ్దాల్లో లక్షల రూపాయలకు చేరింది. గతేడాది బాలాపూర్ లడ్డూను కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌ గౌడ్‌ రూ.35 లక్షలకు దక్కించుకోగా, 2024లో రూ.30.01 లక్షలు పలికింది. ఈసారి పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో ఏర్పాటు చేసిన మండపంలో కొలువైన బాలాపూర్ గణపయ్య లడ్డూ (21 కిలోలు) కొత్త రికార్డు సృష్టిస్తుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గేటెడ్ కమ్యూనిటీలలో కోట్లలో ధర పలుకుతున్న నేపథ్యంలో బాలాపూర్ లడ్డూ ఆ రికార్డులను అందుకుంటుందా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బాలాపూర్ వేలం అనంతరం జరిగే గణేశుడి శోభాయాత్రతోనే నగర నిమజ్జనం ప్రారంభం కావడం ఆనవాయతీ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు